తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కీలకమైన చర్చలు జరగనుండగా, పథకాన్ని అమలు చేసే విధానాలపై నిర్ణయాలు తీసుకోవడం కోసం సబ్ కమిటీ సమావేశమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్రాంతి తరువాత రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యంగా ఉంది.
ఇంతకు ముందుగా, ఉమ్మడి జిల్లాల వారిగా సబ్ కమిటీ రైతు భరోసాపై అభిప్రాయ సేకరణను పూర్తి చేసింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ పథకం పై చర్చ జరిగింది, ప్రభుత్వం ప్రతిపక్షాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంది. రైతు భరోసా పథకాన్ని రైతు బంధు తరహాలో భూరికార్డుల ఆధారంగా కాకుండా, సాగు భూమి లెక్కల ఆధారంగా అందించాలని ప్రభుత్వ భావన. గూగుల్ డేటా, శాటిలైట్ ఇమేజీల ఆధారంగా సాగు భూమిని లెక్కించి, పంట వేసిన రైతులకు భరోసా సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

