తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పుస్తకాల ప్రాముఖ్యతను వివరిస్తూ, శుభకార్యాలకు బొకేలకు బదులుగా పుస్తకాలను అందజేయాలని సూచించారు.
“పుస్తకాలు అనేక విధాలుగా మన జీవన విధానాన్ని మారుస్తాయి. అందులో అనేకమైన జ్ఞానం దాగి ఉంది. ప్రస్తుతం నిరక్షరాస్యుల కోసం ఆడియో బుక్స్ కూడా అందుబాటులోకి రావడం గొప్ప అభివృద్ధి. పుస్తకాలను క్షుణ్ణంగా చదవడం ద్వారా జీవితానికి ఉపయోగపడే జ్ఞానాన్ని పొందవచ్చు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సంప్రదాయ పుస్తకాల ప్రాముఖ్యతను వెలుగులోకి తీసుకువస్తోంది,” అని ఆయన పేర్కొన్నారు.
ఈ-పుస్తకాల కంటే ముద్రిత పుస్తకాలు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. “పుస్తకాలు చదవడం వలన రచయితలతో నేరుగా మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఈ-బుక్స్ అందించిన అనుభవం పుస్తకాల ఫీలింగ్‌ను అందించలేవు. పుస్తకాల ద్వారా విశ్వం గురించి తెలుసుకోవచ్చు. యువతను పుస్తకాలపై మక్కువ పెంచేలా పెద్దలు ప్రోత్సహించాలి,” అని గవర్నర్ తెలిపారు.

