ఒక్కరిని టార్గెట్ చేసి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నావ్
పాలన గాలికి ఒదిలేసి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నావ్
ప్రెస్ నోట్ విడుదల చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన సంఘటన బాధాకరమని హరీశ్ రావు అన్నారు. మంగళవారం ప్రభుత్వ వైఫల్యాలపై ఒక్క ప్రెస్ నోటును హరీష్ రావు విడుదల చేశారు. అందులో చట్టం అందరికీ సమానంగా ఉండాలని, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం అసహజమని అన్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయించిన కాంగ్రెస్ గుండాలు, గతంలో ఆయనతో ఫోటోలు దిగిన వారేనని, అదే గూండాలను ఉపయోగించి ఈ దాడి చేశారని హరీశ్ రావు ఆరోపించారు.
నన్ను టార్గెట్ చేస్తూ సిద్ధిపేటలో నా క్యాంపు ఆఫీసుపై దాడి చేయించారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర కాదా…. అనేది స్పష్టంగా చెప్పాలన్నారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రాయలసీమ తరహా ఫ్యాక్షన్ రాజకీయాలను రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని ఆరోపించారు. గురుకులాల్లో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినప్పుడు వారికి ఎక్స్ గ్రేషియా కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి మీరే(రేవంత్ రెడ్డి) మంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్లక్ష్యం ఎందుకు జరిగినది అని అడిగారు. రేవంత్ రెడ్డి తమ్ముడి అరాచకాల వల్ల సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి చనిపోతే కూడా కేసు నమోదు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణ సమాజంలో ప్రశ్నించే గొంతులపై భౌతిక దాడులు చేయడం, ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని అని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లా అండ్ ఆర్డర్‌ను దెబ్బతీస్తోందన్నారు. రైతుల మరణాలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరిగినప్పుడు చలనం లేని కాంగ్రెస్, ఇప్పుడు ఒక లక్ష్యంగా వ్యక్తులను టార్గెట్ చేస్తోందని విమర్శించారు. భౌతిక దాడుల ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనుకుంటున్న కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో సరైన బుద్ధి చెప్తారని అన్నారు.
రాష్ట్ర ఇమేజ్‌కు నష్టం కలిగించే ఈ రాజకీయాలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో శాంతి, భద్రతలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, అలాంటి ప్రభుత్వం నైతికత పాటించాలని సూచించారు.

