జనజీవన స్రవంతిలోకి…
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి|POTHULA PADMAVATHI

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (అడుగు న్యూస్):
తెలంగాణ మావోయిస్టు ఉద్యమానికి బలమైన నాయకురాలిగా ఉన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ మైనక్క, మైనాబాయి, సూజాత శనివారం తెలంగాణ డీజీపీ జితేందర్ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో 2011లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు మలోజ్జుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ భార్య ఈ పద్మావతి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన ఆమె, పటేల్ సుధాకర్ రెడ్డి, పోతుల సుదర్శన్ రెడ్డి అలియాస్ ఆర్కే, ఆయన భార్య సుగుణ వంటి విప్లవ కార్మికులను స్ఫూర్తిగా తీసుకుని విప్లవ మార్గంలో అడుగుపెట్టారు. 1982లో ఇంటర్మీడియెట్ చదువుతున్న సమయంలో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన పద్మావతి, రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో పని చేశారు. గ్రామాలకు తిరిగి వెళ్దాం అనే నినాదంతో గద్దర్, సుగుణలతో కలిసి గ్రామీణ స్థాయిలో పనిచేసి, కొంతకాలం జననాట్య మండలిలోనూ పనిచేశారు. కోఠిలో పీస్ బుక్ సెంటర్‌లో పనిచేసిన సమయంలో కిషన్‌జీతో పరిచయం ఏర్పడి, ఇద్దరూ వివాహం చేసుకుని ఒక కూతురికి జన్మనిచ్చారు. 1987లో గడ్చిరోలి జిల్లాలో పార్టీ నిర్మాణంలో చురుకుగా పనిచేసి, డిప్యూటీ కమాండర్ స్థాయికి ఎదిగారు. 1996లో చత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్‌లో డివిజనల్ కమిటీ మెంబర్ గా, బాసగూడ ఏరియా కార్యదర్శిగా, 2001లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. జనతన్ సర్కార్ గ్రామ కమిటీల పర్యవేక్షణ, సిఎన్ఎం, కేఏఎంఎస్, డిఏకెఎమ్ఎస్ వంటి ప్రజా సంఘాల సమన్వయం ఆమె బాధ్యతల్లో భాగమయ్యాయి. 2007లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, ఎస్.యు.సి.ఓ.ఎం.ఓ వ్యవహారాలను పర్యవేక్షించారు. 2018లో జనతన్ సర్కార్ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న ఆమె, 2022లో దక్షిణ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా, 2023లో కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఎదిగారు. అంతేకాకుండా, కోయ బాషలో ముద్రించే పేతురి పత్రిక సంపాదకురాలిగానూ వ్యవహరించారు. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పద్మావతి పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న ద్వారా లేఖ పంపి, ఇక పార్టీ కార్యకలాపాలకు దూరమవుతున్నానని తెలిపారు. పోరు వద్దు, ఊరు ముద్దు అనే నినాదాన్ని పాటిస్తూ ప్రజాజీవనంలో కలవాలనుకుంటున్నానని ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఇప్పటి వరకు 404 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో నలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక డివిజనల్ కార్యదర్శి, 34 ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం 74 మంది తెలంగాణకు చెందిన వారు మావోయిస్టు పార్టీలో ఉన్నారని, 15 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలుగు వారేనని ఆయన తెలిపారు. గత ఏడాది 22 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 10 మంది చనిపోయారని డీజీపీ వివరించారు. శాంతి చర్చల గురించి మాట్లాడుతూ, గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయని కానీ ఎలాంటి ఫలితం రాలేదని అన్నారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తమను తాము కాపాడుకోవడానికే చర్చల ప్రతిపాదన తెరపైకి వస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న లొంగుబాటు విధానం కొనసాగుతుందని, విప్లవ మార్గంలో ఉన్నవారు ప్రజాజీవనంలో కలవాలని డీజీపీ పిలుపునిచ్చారు.


