తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలో ఓ సాధారణ ఆటో డ్రైవర్‌కు కీలకమైన పదవి దక్కింది. కోయంబత్తూరు సబర్బన్ ఈస్ట్ జిల్లా కార్యదర్శిగా బాబు అనే ఆటో డ్రైవర్‌ను నియమించారు. విజయ్ వీరాభిమాని అయిన బాబు తనకు పార్టీలో గౌరవమైన పదవి దక్కడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆయన నియామక వార్త తెలియగానే ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు అతనిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, తాను విజయ్ మక్కల్ ఇయక్కమ్ సభ్యుడిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నానని వెల్లడించాడు. పార్టీ ప్రారంభమైన తర్వాత సాధారణ కార్యకర్తగా కొనసాగుతూ విజయ్ సూచనల మేరకు పని చేశానని, ఇప్పుడు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం తనకు గౌరవంగా ఉందని పేర్కొన్నాడు. ఆటో డ్రైవర్ నుంచి రాజకీయంగా ఇంతటి ఎదుగుదల సాధించడం తనకు గర్వంగా ఉందని, ప్రజల కోసం మరింత సమర్థంగా పనిచేస్తానని హామీ ఇచ్చాడు. నటుడు విజయ్ స్థాపించిన పార్టీ సామాన్యులకు ప్రాధాన్యత ఇస్తుందనే విషయం ఈ నిర్ణయంతో మరోసారి రుజువైంది.

