భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5-6.8 శాతం వృద్ధి చెందుతుందని డెలాయిట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆర్థిక సంవత్సరపు మొదటి అర్థభాగంలో వృద్ధి కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ, ద్వితీయార్థంలో రికవరీ కనిపిస్తోందని డెలాయిట్ ఇండియా ఎకనామిస్ట్ రుమ్కీ మజుందార్ తెలిపారు. అధిక వినియోగం, సేవల విభాగం వేగంగా అభివృద్ధి చెందడం, విలువైన తయారీ ఎగుమతులు వృద్ధికి దోహదపడుతున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భౌగోళిక రాజకీయ పరిణామాలు, అధిక వర్షపాతం, ఎన్నికలు వంటి అంశాలు డిమాండ్, ఎగుమతులపై ప్రభావం చూపించాయి. అయినప్పటికీ, ప్రభుత్వం మౌలిక అభివృద్ధి, డిజిటలైజేషన్, ఎఫ్డీఐల ఆకర్షణపై దృష్టి పెట్టడం వృద్ధికి సహకరిస్తోంది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, కెమికల్స్ వంటి కీలక రంగాల్లో తయారీ ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి.
2025-26 నాటికి ఆర్థిక వృద్ధి 6.7-7.3 శాతం మధ్య పుంజుకునే అవకాశం ఉందని డెలాయిట్ అంచనా వేసింది. గ్రామీణ మరియు పట్టణ డిమాండ్ భవిష్యత్ ఆర్థిక వృద్ధికి కీలకంగా మారుతుందని పేర్కొంది.

