RSS|ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ MOHAN BHAGAVAT|మోహన్ భగవత్ పిలుపు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నాలో జరిగిన సింధీ క్యాంప్ గురుద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో జరుగుతున్న ప్రజా తిరుగుబాట్లు, ఉద్రిక్తతల నేపథ్యంలో భగవత్ మాట్లాడుతూ, పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. భారతదేశాన్ని ఒక ఇల్లుతో పోల్చిన ఆయన, ఆ ఇంటిలోని ఒక గది పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా ఉందని, దానిని ఎవరో ఆక్రమిస్తే నిశ్శబ్దంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఇంటి గదిని తిరిగి స్వాధీనం చేసుకోవడం మన కర్తవ్యమని, భారతదేశం అవిభక్త భారతదేశం కావాలని గుర్తుచేశారు.
భగవత్ మాట్లాడుతూ, భారతదేశం అనే ఇల్లు మొత్తం ఒకటే. మన ఇంట్లోని ఒక గది పాక్ ఆక్రమిత కశ్మీర్ రూపంలో ఆక్రమించబడింది. దాన్ని మనం తిరిగి పొందాలి. ఇది రాజకీయ విషయం కాదు, మన ఆత్మగౌరవం, జాతి ఏకత్వం అంశం. అవిభక్త భారతదేశాన్ని తిరిగి నిర్మించాలనే దిశగా అందరం కృషి చేయాలి అని అన్నారు. సభలో ఆయన వ్యాఖ్యలకు హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.
ఇక భగవత్ మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ, మనమంతా ఒకటే. మతం, భాష, ప్రాంతం వేరు అయినా మన మూలం ఒకటే. మనమంతా హిందువులమే. సింధీ సోదరులను చూసి ఆనందంగా ఉంది. వారు పాకిస్తాన్‌కు వెళ్లలేదు, అవిభక్త భారతదేశంలోని ఒక ప్రాంతానికి వెళ్లారు. పరిస్థితులు వారిని వేరుచేశాయి కానీ ఆ ఇల్లూ, ఈ ఇల్లూ వేరు కావు” అని అన్నారు. ఇంటి ఒక గదిని ఎవరో బలవంతంగా ఆక్రమించుకున్నారు. కానీ అది మనదే కాబట్టి, మనం దానిని తిరిగి తీసుకోవాల్సిందే అని ఆయన పిలుపునిచ్చారు.
ఇక పీఓకేలో ఇటీవల హింసాత్మక నిరసనలు చెలరేగాయి. పాక్ ప్రభుత్వం, సైన్యం చేస్తున్న అణచివేత చర్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 12 మంది మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పాకిస్తాన్ పాలనలో ఉన్న పీఓకే ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తోంది. నిరసనలను అణచివేయడానికి ప్రయత్నించిన పాక్ ప్రభుత్వం చివరకు ఆ కమిటీతో చర్చలు జరిపి 25 అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. హింసలో మరణించిన వారికి పరిహారం ఇవ్వడంతో పాటు, ముజఫరాబాద్, పూంచ్ డివిజన్లలో అదనంగా రెండు ఇంటర్మీడియట్, సెకండరీ విద్యా బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు పాకిస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్ ఫజల్ చౌదరి వెల్లడించారు.
పీఓకేలో పెరుగుతున్న అసంతృప్తి, ప్రజల్లో ఆగ్రహం నేపథ్యంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఆయన పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిలుపునివ్వడం, భారతీయ ఏకత్వం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. దేశ సార్వభౌమ్యానికి భగవత్ వ్యాఖ్యలు నూతన ఉత్సాహాన్ని నింపాయని, భారత జాతి ఐక్యతకు ఇది ప్రేరణగా నిలుస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.

