ఆహార పంటలు అధికంగా పండుతున్న అన్నపూర్ణ లాంటి దేశంలో అదే ఆహార ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రకరకాల పరోక్ష పన్నుల స్థానంలో వస్తువులు మరియ సేవల (జీఎస్టీ) పన్ను విధానం అమలుతో గతంలో మినహాయింపు ఉన్న వస్తువులు సహా అన్ని రకాల వస్తువులపై పన్నులు అధికమయ్యాయి. దీనికి తోడు అడ్డూ అదుపు లేని పెట్రో, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, వీటిపై కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరుగా వేస్తున్న పన్నులు తడిసి మోపెడు అవుతున్నాయి. అసలు ఒక పన్నుల పద్ధతే లేకుండాపోయింది. ఆదాయ సముపార్జనే ధ్యేయంగా ప్రభుత్వాలు పని చేస్తుండటం పేదల పాలిట శాపంగా మారింది. అధికారం కోసం నానా గడ్డీ కరిచే పార్టీలు, పాలకులు మొసలి కన్నీరు కారుస్తూ, ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తున్నాయి.
నిజానికి ఏకీకృత పన్ను విధానం పేరుతో తీసుకుని వచ్చిన జీఎస్టీ ఇప్పుడు సామాన్యులకు గుదిబండగా మారింది. పాన్, ఆధార్ లింక్ కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారనుంది. దీనికితోడు కనీసం చార్జీగా వేయి రూపాయలను వడ్డిస్తున్నారు. తాజాగా యూపిఎ చెల్లింపులపై ట్యాక్స్ విధించే ఆలోచన దుర్మార్గం కాక మరోటి కాదు. అప్పుడెప్పుడో తుగ్లక్ కాలంలో జుట్టు పన్ను కూడా విధించారు. ఇప్పుడు అదే తరహాలో పన్నులేని పని, వస్తువు, సేవలు లేకుండా పోయాయి. పన్నుల రూపంలో ప్రజలు ఇల్లు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
అన్ని రకాల వస్తు సేవలపై ప్రభావం చూపే పెట్రో, డీజిల్, గ్యాస్, జిఎస్టీ ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ, దేశీయంగా పెట్రో ధరలను పెంచి తీరాలన్న నియమమేమీ లేదు. కానీ అలా పెంచడం వల్ల ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లు ఇప్పుడు కేంద్రానికి ప్రధాన ఆదాయవనరుగా మారింది. పెట్రో ధరల పెంపు ప్రభుత్వం అనుసరించే ద్రవ్య వ్యూహాన్ని బట్టి ఉంటుంది. ఈ ద్రవ్య వ్యూహాన్ని ప్రభుత్వాలు ఎప్పటి కప్పుడు మార్చుకునే వీలున్నా, అందుకు విరుద్ధంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంతర్జాతీయ చములు నిలువలు, ధరల సాకుతో పెట్రో ధరలను తమకు ఇష్టం లేకున్నా పెంచవలసి వస్తోందని వాపోవడం ప్రభుత్వాల దొంగనాటకానికి నిదర్శనం. పెట్రో ఉత్పత్తుల ధరల్లో సగానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులకే పోతుంది. ఈ పన్నులకి, అంతర్జాతీయ చమురు ధరలకి సంబంధమే లేదు. అయినా ఆ పన్నులను పెంచుకుంటూ ప్రభుత్వాలే ప్రజల్ని దోచుకుంటున్నాయి. కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రో పన్నులు పెంచుతోంటే, రాష్ట్రాలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చా పన్నుల్లో కేంద్రం గుత్తాధిపత్యం పెరిగి, రాష్ట్రాల పన్నుల వాటా తగ్గిపోయింది. దీంతో రాష్ట్రాలు తమ పరిమితమైన ఆదాయ వనరులను పెంచుకోవడానికి పన్నులకు ఎగపడుతున్నాయి. పైగా పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రావు. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు పెట్రో ఉత్పత్తుల విూద పన్నులు వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యక్ష పన్నులు విధించే అధికారం లేనందువలన వాటికి వేరే దారి లేదు. కాని కేంద్ర ప్రభుత్వం వేరు. వేర్వేరు మార్గాల్లో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా, కావాలనే కేంద్రం ఆ మార్గాలను ఉపయోగించడంలేదు.
సంపన్న వర్గాలే పెట్రో ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తాయి గనుక పెట్రో ఉత్పత్తుల విూద ధరలు పెరిగితే ఆ భారం పేదల మీద పడదనేది తప్పుడు వాదన. ఒకప్పటి సంగతేమో కానీ, ఇప్పుడు పెట్రో ఉత్పత్తులను అధికంగా వినియోగిస్తున్నది పేద మధ్య తరగతి వర్గాలే. నిజానికి పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగితే, రవాణా చార్జీలు, వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఇదంతా ఒకదానిపై ఒకటిగా ఆధారపడి ఉండే చైన్ సిస్టమ్. ఆహార ధాన్యాలను, నిత్యావసర సరుకులను ఎక్కువగా ఉపయోగించేది కూడా నిరుపేద, మధ్యతరగతి వారే. ఉన్నత, సంపన్న వర్గాలు ఉత్పత్తి చేసే వస్తువులపై పెరిగే ధరల ప్రభావం కూడా వాటిని వినియోగించే పేద మధ్య తరగతి మీదే భారంగా పరిణమిస్తున్నది. అంతిమంగా ధరలు పెరిగి వినియోగం తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గుతుంది. నిరుద్యోగిత పెరుగుతుంది. ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంతా కలిసి ఆర్థిక సంక్షోభానికి ఆస్కారం ఏర్పడుతుంది.
ప్రభుత్వాలకు నిజాయితీ ఉంటే ప్రత్యామ్నాయ ద్రవ్య విధానాన్ని అమలు చేయాలి. అదికూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాలి. అప్పుడే ప్రజలపై భారం తగ్గుతుంది. జీఎస్టీతో ప్రజలు అల్లాడుతున్నా, పన్నులు కట్టలేక చస్తున్నా, పెట్రోల్ ధరలతో దాడులు చేస్తున్నా, పట్టించుకోని, పైగా వాటిని పెంచుతున్న ప్రధాని మోడీ, రాష్ట్రాలు మాత్రం వ్యాట్ ను తగ్గించాలని సూచిస్తున్నారు. రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోకుండానే, ప్రజల్ని విస్మరించి మరీ మోడీ ప్రజలపై పన్నుల, ధరల భారం మోపుతున్నారు.
ఇక ధరల పెరుగుదల సామాన్యుల సొంతింటి కలను ఛిద్రం చేస్తున్నది. బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ఇవి ప్రభుత్వ అజమాయిషీ లేని అంశాల జాబితాలోకి చేరిపోయాయి. ఆదాయాలు పెరగని ప్రజలు ధరల పెరుగుదలను భరించే స్థితిలో ఉంటారా? పాలకులు ఆలోచించాలి. ఇవే పన్నులు, జీఎస్టీ, అధికర ధరలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే, అదే పాలకులు తమ జీత భత్యాల పెంపుపై మాత్రం ఏకాభిప్రాయంతో ఉంటారు. సేవ పేరుతో రాజకీయాలు చేస్తూ, పదవుల పేరుతో రాజభోగాలు అనుభవిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను విస్మరిస్తున్నారు.

