అహ్మదాబాద్‌లోని సబర్మతి నది ఒడ్డున జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ (CWC) విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహానేతలు పుట్టినగడ్డపై జరుగుతున్న ఈ “చింతన్ బైఠక్” రెండు రోజుల పాటు ప్రజా సమస్యలపై గంభీర చర్చలకు వేదికగా నిలిచిందన్నారు. దేశంలో ప్రధాని మోదీ చేస్తున్న విభజన రాజకీయాలకు ప్రజల అండతో గట్టి బదులివ్వాలన్నదే ఈ సమావేశ లక్ష్యమని పేర్కొన్నారు.
గాంధీజీ ఆలోచనలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నాయకత్వం లో కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. దేశంలో గాడ్సే భావజాలాన్ని వ్యాప్తి చేసే మోదీ కూటమికి వ్యతిరేకంగా ప్రతి గాంధేయవాది పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ పాలనలో రైతులపై నల్లచట్టాలు, మణిపూర్‌లో మత విభేదాల మంటలు, యువతకు ఉద్యోగావకాశాల లోపం వంటి అనేక విషమ స్థితులను సీఎం రేవంత్ వివరించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి గుర్తు చేస్తూ, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, రైతు సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, మహిళల రక్షణపై హామీలు ఇచ్చారని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది లోపలే నెరవేర్చిందని సీఎం చెప్పారు. ఇప్పటికే రూ. 21,000 కోట్ల రైతు రుణమాఫీ, కుల గణన చేపట్టడం, నిరుద్యోగులకు మద్దతు వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని వెల్లడించారు.
మోదీ వాగ్దానాలన్నీ వాయిదాలుగా మారాయని, 11 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాల ప్రస్తావన శూన్యమైందన్నారు. కేవలం మోదీ, అమిత్ షాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయంటూ విమర్శించారు. దేశంలోని గాంధేయవాదులు ఇప్పుడు మోదీ వ్యతిరేక పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని రేవంత్ పిలుపునిచ్చారు.
తెలంగాణకు స్వాతంత్రం వల్లభాయ్ పటేల్ ఇచ్చారని, రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ కారణమన్నారు. గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజల మధ్య భావోద్వేగ సంబంధం ఉందన్నారు. గుజరాత్ గడ్డ నుంచే బీజేపీని అడ్డుకుంటామని, మోదీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాలని కోరారు.

