యూపీలో భారీ ఏర్పాట్లు
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా భక్తులతో కిక్కిరిసిపోతోంది. గంగా, యమునా, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ విశేష ఆధ్యాత్మిక వేడుకలో ఫిబ్రవరి 5న భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.
ప్రధాని రాక నేపథ్యంలో యూపీ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. బుధవారం ఉదయం 10 గంటలకు మోదీ బమ్రౌలి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అనంతరం ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా అరయిల్‌లోని హెలిప్యాడ్‌కు వెళ్లి, కారులో విఐపి జెట్టీ చేరుకుంటారు.
ప్రధాని మోదీ షెడ్యూల్:
- అరయిల్ ఘాట్ నుంచి పడవ ద్వారా సంగం చేరుకుంటారు.
- అక్కడ నిషాదరాజ్ ఘాట్ వద్ద పుణ్యస్నానం చేస్తారు.
- గంగా నదికి హారతి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
- అఖారాలు, ఆచార్యవాడ, దండివాడ, ఖాక్‌చౌక్ ప్రతినిధులతో సమావేశమవుతారు.
- దాదాపు గంటపాటు కార్యక్రమంలో పాల్గొని తిరిగి బయలుదేరతారు.
గత మహాకుంభమేళా (2019) సందర్భంగా ప్రధానమంత్రి మోదీ పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగి, సామాజిక సామరస్యానికి నిదర్శనంగా నిలిచారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈసారి కూడా మహాకుంభమేళా విజయవంతంగా సాగాలని ప్రార్థిస్తూ, ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

