కర్ణాటకలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు 15 శాతం మేర పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 5వ తేదీ నుంచి ఈ పెంపు అమలులోకి రానుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. పెంచిన ఛార్జీల ద్వారా ఆర్టీసీ రోజుకు రూ. 7.84 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోనుంది. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వచ్చిన ఆర్థిక ఇబ్బందులను తీరుస్తున్నదని అధికారులు వివరించారు. ఈ పెంపు, కర్ణాటక స్టేట్ రోడ్డు కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ), కల్యాణ కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌డబ్యూకేఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సులకు వర్తించనుంది.
రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్న శక్తి పథకంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. నెలకు రూ. 417 కోట్ల భారంతో ఈ పథకాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం, నష్టాలను తగ్గించుకోవడం కోసం ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకుంది.
అయితే, ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ ప్రభుత్వం దురాశతో కన్నడిగులపై పన్నులు, ఛార్జీల భారం వేస్తోందని ధ్వజమెత్తారు.

