ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థిరత్వంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. అమెరికా వంటి శక్తివంతమైన దేశాల నిర్ణయాలు కేవలం వారి భూభాగాలకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి సాధారణ ప్రజల జీవన ప్రమాణాల వరకు అన్నిచోటా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ఇటీవలి సంఘర్షణల నేపథ్యంలో అమెరికా తీసుకున్న చర్యలు వివాదాస్పదంగా మారాయి. ఏకపక్షంగా సైనిక దాడులు, ఆర్థిక ఆంక్షలు, దౌత్యపరమైన ఒత్తిళ్ల ద్వారా ఇరాన్‌ను నియంత్రించాలనే ప్రయత్నం జరిగింది. అయితే, ఈ విధానాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా, ఉద్రిక్తతలను మరింత పెంచాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం, గత కొద్ది నెలల్లో జరిగిన ఘర్షణల కారణంగా గల్ఫ్ ప్రాంతంలో చమురు సరఫరా 15% నుంచి 20% మేర అంతరాయం కలిగింది. ఈ కారణంగా ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరలు 25% వరకు పెరిగాయి.
యుద్ధ ప్రభావం కేవలం ఇంధన ధరల పెరుగుదలతో మాత్రమే ఆగిపోలేదు. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కనీసం 0.5 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ముఖ్యంగా ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలు మరింతగా నష్టపోతున్నాయి. ఇండియా వంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి సాధారణ ప్రజలపై భారం పడుతోంది.
రాజకీయ పరంగా కూడా ఈ సంఘటనలు కీలక ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సర్వేల ప్రకారం, విదేశీ యుద్ధాలలో అమెరికా జోక్యాన్ని 55% మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రభావం రాబోయే ఎన్నికలపై పడనుంది. ఒకవైపు భద్రతా కారణాలు చూపుతూ ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించే వర్గం ఉండగా, మరోవైపు ఆర్థిక భారం, మానవ నష్టం వంటి అంశాలను ప్రస్తావిస్తూ వ్యతిరేకించే వర్గం పెరుగుతోంది.
ఈ యుద్ధం ఇరాన్ జాతీయ సమైక్యతకు దారితీసింది. అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ, బాహ్య ముప్పు ఎదురైనప్పుడు ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడటం సహజం. దేశానికి, నాయకత్వానికి మద్దతుగా పెద్దఎత్తున ప్రజా ర్యాలీలు, దేశభక్తి నినాదాలు, రక్షణ చర్యలకు మద్దతుగా నిలవటం చూస్తున్నాం. ఈ పరిణామాలు యుద్ధం ద్వారా ఒక దేశాన్ని బలహీనపరచడం అంత సులభం కాదని తేలుస్తోంది.
స్పష్టమైన లక్ష్యం లేకుండా యుద్ధంలోకి దిగడం ప్రమాదకరం. ఒకసారి ప్రభుత్వ మార్పు, మరోసారి అణు కార్యక్రమ నియంత్రణ, ఇంకోసారి భద్రతా ముప్పు వంటి మారుతూ వచ్చిన అమెరికా లక్ష్యాలు వ్యూహాత్మక అస్పష్టతను సూచిస్తున్నాయి. ఈ పరిస్థితి మిత్రదేశాల మధ్య కూడా అనుమానాలకు దారితీస్తోంది.
మరోవైపు హార్ముజ్ జలసంధి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచ చమురు సరఫరాలో 20% ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఈ మార్గంలో అంతరాయం కలిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తడం ఖాయమని తేలింది. ఇప్పటికే కొన్ని రోజుల అంతరాయంతోనే మార్కెట్లు కుదేలయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం పాత్ర కీలకం. యుద్ధం కంటే చర్చలు, దౌత్యపరమైన పరిష్కారాలు, పరస్పర అవగాహన ద్వారానే దీర్ఘకాలిక శాంతి సాధ్యమవుతుంది. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు మరింత చురుకుగా వ్యవహరించి, మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం ఉంది.
మొత్తం మీద, బల ప్రదర్శనలతో సమస్యలు పరిష్కారం కావని అమెరికా-ఇరాన్ యుద్ధం తేల్చేసింది. యుద్ధం తాత్కాలిక రాజకీయ లాభాలను ఇచ్చినా, దీర్ఘకాలంలో ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను దెబ్బతీసి, మానవ నష్టాలను పెంచుతుంది. ప్రపంచ దేశాలు ఈ వాస్తవాన్ని గుర్తించి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

