అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ‘తండేల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరుకావాల్సిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనారోగ్యం కారణంగా పాల్గొనలేకపోయారు. ఈ విషయాన్ని నిర్మాత అల్లు అరవింద్ వివరిస్తూ, బన్నీ విదేశీ ప్రయాణం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తీవ్రమైన గ్యాస్ట్రిటిస్‌తో బాధపడుతున్నారని తెలిపారు. ‘తండేల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ గెస్ట్‌గా రావాల్సి ఉంది. కానీ ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత సివియర్ గ్యాస్ట్రిటిస్ వచ్చింది. అందుకే ఈవెంట్‌కు హాజరుకాలేకపోయాడు. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయమని ఆయన కోరాడు. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోవద్దు’ అని అల్లు అరవింద్ చెప్పారు.
ఈ ఈవెంట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ, “నా మనసులో గీతా ఆర్ట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సినిమా పూర్తయ్యే సమయంలో వాసు గారు, అల్లు అరవింద్ గారు లేకుండా మరో సినిమా ఎలా చేయాలా అనే భయం మొదలైంది. వారు ఎంతో మద్దతుగా నిలిచారు. దర్శకుడు చందు మొండేటి నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమాలో శ్రీకాకుళం యాసలో మాట్లాడటం నాకు సవాలుగా అనిపించింది. అలాగే, మత్స్యకార గ్రామాల్లో పరిశీలన చేసిన తర్వాత ఈ కథ ఎంత బలంగా ఉందో అర్థమైంది. వాళ్లతో పాటు ఈ కథ లేకుండా ‘తండేల్’ సాధ్యం కాదు” అని తెలిపారు.
‘తండేల్’ విడుదలకు సిద్దం
చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘తండేల్’ సినిమా ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆదివారం గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ‘పుష్ప 2’ వంటి భారీ చిత్రం తర్వాత బన్నీ హాజరయ్యే తొలి సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కావడంతో అభిమానులు భారీగా ఆసక్తి చూపించారు. అయితే చివరి నిమిషంలో ఆయన హాజరు కాలేకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ కనిపించింది.

