దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్ SSMB 29 గురువారం అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారని సమాచారం. మహేశ్ బాబు చిత్రబృందంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం, అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మహేశ్ అభిమానులు మాత్రం ఈ వార్తపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వేసవి కాలం నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాక్. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖ నటీనటులు నటించనున్నారని, అలాగే హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకారం, ఈ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. అమెజాన్ అడవుల నేపథ్యంగా సాగే ఈ కథను భారతీయ భాషలతో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లోనూ అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్, కే. ఎల్ నారాయణ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం మహేశ్ ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని సమాచారం. రాజమౌళి కూడా కథకు అనుగుణంగా లొకేషన్ల కోసం ఒడిశా, ఆఫ్రికా వంటి ప్రాంతాలను పరిశీలించారు.

