భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు. హిందూ సాంప్రదాయాల, విశ్వాసాలలో జన్మ సిద్దాంతం ఒకటి. జన్మసిద్దాంతం ప్రకారము పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది. దానికి తగిన విధంగా, తగిన సమయంలోనే జీవి జననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి గ్రహస్థితిలో జీవి జననం జరుగుతుంది. ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతి జీవి భూత భవిష్యత్ వర్థమాన కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.హస్తసాముద్రికము, గోచారము, నాడీ జ్యోతిషం. ప్రశ్న చెప్పడం, మొదలైన విధానాలు
వాడుకలో ఉన్నవి.
పురాణాలలో జ్యోతిష్యం
శ్రీనివాసుడు పద్మావతిని చేపట్టడానికి సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి తన ప్రణయ వృత్తాంతాన్ని ఆకాశరాజు దంపతులకు తెలిపి వారిలో తమ వివాహం పట్ల సుముఖత కలిగించి పద్మావతిని పరిణయమాడటంలో విజయం సాధించినట్లు పురాణ కథనాలు చెప్తున్నాయి.
కంసుడికి మేనల్లుడి రూపంలో మరణం పొంచివున్నట్లు ఆకాశవాణి ముందుగానే వినిపించింది.
శిశుపాలుని మరణం కృష్ణుని ద్వారా సంభవించనున్నదని పెద్దలు చెప్పినట్లు అందువలన శిశుపాలుని తల్లి కృష్ణుని నుండి నూరు తప్పుల వరకు సహించేలా వరం పొందినట్లు భారతంలో వర్ణించబడింది. ఆ తరువాత నూరు తప్పులు చేసి శిశుపాలుడు కృష్ణుని చేతిలో మరణించడం లోక విదితం.
ఐదుగురు మహావీరులు ఒకే నక్షత్రంలో పుడతారని, వారిలో మొదటిసారిగా ఎవరు ఎవరిని సంహరిస్తారో, మిగిలిన ముగ్గురు అతని చేతిలోనే మరణిస్తారని ముందుగానే చెప్పడం జరిగింది. ఆ ఐదుగురు మహావీరులు ఎవరంటే భీముడు, ధుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు. అందుకే గాంధారి తన కుమారుడు దుర్యోధనుడిని దీర్ఘాయుష్కుని చేయటానికి, అతని శరీరాన్ని వజ్రకాయంగా మార్చడానికి శక్తివంతమైన మూలికా ఔషధాన్ని అతనికి రాస్తున్నప్పుడు, దానిని చెడగొట్టడానికే, పనిగట్టుకుని మరీ శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి, దుర్యోధనుడిని ఆయుఃక్షీణుడిని చేసాడనే విషయం కూడా లోక విదితమే
త్రిజటా స్వప్నవృత్తాంతములో శ్రీ రాముడు రావణుని వధించి సీతమ్మను విడిపించినట్లు త్రిజట వాల్మీకి పలికించడం స్వప్నాధారిత జ్యోస్యం వాడుకలో ఉన్నదని చెప్పడానికి నిదర్శనం.
అనేక పురాణాలలో జ్యోతిష్యశాస్త్రమునకు సంబంధించిన శాస్త్రీయాంశాలు పేర్కొనబడినవి. గరుడ మహా పురాణం జ్యోతిష్య శాస్త్రాన్ని (పూర్వఖండము లోని 59 నుండి 67 అధ్యాయములవరకు గల) తొమ్మిది అధ్యాయాలలో వివరించింది. వీటిలో సాముద్రిక శాస్త్రమును గురించి 64,65 అధ్యాయాలు రెండింటిలో విశదీకరించింది.”

