ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు, కోటీశ్పరులు అన్నట్లు! గా ఎడ్లే, గా ఎడ్లబండ్లను గుంజుకపోయేది. గందుకే ఎడ్లను మనుసులకంటే గూడ ఎక్కువగ సూసుకునేది. ఇగిప్పుడు ఎడ్లు, ఎడ్లబండ్లే కనిపిత్తలేవాయె! ఒకాయినె గా పాత ఎడ్ల బండినే, ఎడ్లకు ఏ కొంచెం కూడ బరువు పడకుండ, బండిని తయారు శేసిండు. ఎట్లంటరా?

శెక్కతోటి శేసిన ఎడ్ల బండికి, టైర్ల గిర్రలు పెట్టిండు. ఎడ్ల నొగ శివరికి, కాని ఉంటది గదా? గా కానికి కూడ ఇగురంగ ఎడ్ల ఎత్తుకు తగ్గట్లు, ఎడ్ల మెడల మీద బరువు పడకుండ, ట్రాక్టర్ ముందు గిర్రంత టైరు గిర్రను బిగించిండు. ఇగ గా బండిల తనకు కావాల్సినంత బరువేసిండు. ఎడ్లను కట్టిండు. ‘అ హయి!’ అన్నడు. ఇగ గా ఎడ్లు గా బండిని అల్కగ గుంజుకపోతానయి. రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!

