బాలీవుడ్‌లో సంచలనం
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్‌పై హత్యాప్రయత్నం జరిగిన ఘటన సినీ ప్రపంచంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దాడిలో గాయపడిన సైఫ్‌ను ముంబైలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయనకు అత్యవసర చికిత్స అందించడంతో పాటు శస్త్రచికిత్స కొనసాగుతోంది.
తెల్లవారు జామున 2:30 గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు. తొలుత, సైఫ్ ఇంటి పని మనిషితో వాగ్వాదం పెట్టుకున్న అతను, ఆపై సైఫ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పుడు దాడికి దిగాడు. కత్తితో దాడి చేసిన అతను సైఫ్ శరీరంపై ఆరు చోట్ల తీవ్ర గాయాలు చేశాడు. దాడి జరిగిన అనంతరం, సైఫ్‌ను తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో హాస్పిటల్‌కు తరలించారు. లీలావతి హాస్పిటల్ వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేస్తూ, ఆయనకు రెండు లోతైన గాయాలు అయ్యాయని, వీటిలో ఒకటి వెన్నుపూసకు సమీపంలోనుందని వెల్లడించారు.
సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ నిరజ్ ఉత్తమని స్పందిస్తూ, “ఆయనకు న్యూరోసర్జన్ నితిన్ డాంగే ఆధ్వర్యంలో ఆపరేషన్ జరుగుతోంది. కాస్మటిక్ సర్జన్ లీనా జైన్, అనేస్తేషియన్ నిషా గాంధీ కూడా ఈ చికిత్సలో భాగమయ్యారు. సర్జరీ పూర్తైన తర్వాతే ఆయన పరిస్థితిపై స్పష్టత వస్తుంది,” అని అన్నారు.
ఈ దాడి ఘటనపై ముంబై బంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ఎవరనేది తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా విచారణ చేపట్టింది. నిందితుడి కోసం లుకౌట్ నోటీస్ జారీ చేసిన పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
సైఫ్ ఆలీ ఖాన్‌పై జరిగిన దాడి బాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన కలిగించింది. సైఫ్ ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు ఆసక్తి వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

