కృతయుగంలో రాక్షస సంహారంలో భాగంగా ఆది పరాశక్తి శుంభ నిశుంభ రక్తబీజ మొదలైన రాక్షసులతో పాటు మహిషాసురుడిని సంహరించి లోక రక్షణ చేసిన కారణంగా ఆ రోజు ఆనందంగా అమ్మవారిని ఆరాధించాలి అనుగ్రహం ఇవ్వాలి అని కోరుకోవాలి. మహిషాసుర సంహారం రోజు కనుక విజయ దశమి అని అంటారని పురాణ వచనం.
దశ హర అనే రెండు పదాల నుంచి దసరా అనే పేరు వచ్చింది, వివిధ పాపాది దశలను పోగొట్టేది దసరా. మనం పది ఇంద్రియాలతో ఎన్నో పాపాలను చేస్తుంటాం. ఈ ఇంద్రియాలతో ఉన్న దశలను దాటిన తర్వాత ఉండే శక్తియే పరాశక్తి, ఆ పాపాలను పోగొట్టుకునే శక్తి ఈ దసరా పూజలలో ఉందని శాక్తేయం ఉక్తి.
విజయ దశమి అంటే?
ఆశ్వయుజ శుక్ల దశమికి విజయ అని పేరు, సాయంత్రం వేళలో దశమి ఉంటే ఆ సమయాన్ని విజయగా పిలుస్తారు. విజయ ముహూర్తం ఉన్న దశమి కనుక దీనికి విజయ దశమి అని పేరు వచ్చింది. ఇక ఈ అపరాజిత ఐన తల్లికి ఇద్ధరు చెలికత్తెలు ఉంటారు వారి పేరు జయ, విజయ కనుక జయ విజయ సమేత అపరాజిత అని ఆ తల్లిని అంటారు. జయం, విజయం నిజానికి రెండు ఒకే అర్థంలా అనిపిస్తాయి. జయ విజయలకి ఒకే అర్థం స్ఫురిస్తున్నా, బయట సాధించనది జయం, మన అంతఃకరణలోని వికారాలని జయిస్తే అధి విజయం. బయటి, మనలో ఉన్న అవరోధాలను కూడా జయించాలి. కనుక అపరాజిత ఆరాధన వల్ల అన్నిరకాల జయ విజయాలు పొందడానికే ఈ విజయ దశమి పూజా పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఇది విజయదశమి ప్రత్యేకత. మరి మనం దసర అంటే ఏం చేస్తున్నాం?
శమి పూజ ప్రాశస్త్యం
విజయదశమి లోనే శమి నామం ఉన్నది. విజయ దశమి అంటే విజయాన్నిచ్చే శమి అని అర్థం. అంటే ఈ రోజు శమి వృక్షాన్ని ఆరాధించమన్నారు, శమినే జమ్మి అన్నారు, ఇది ఒక యజ్ఞ విశేమైన వృక్షం. అందుకే దీన్ని యజ్ఞ వృక్షం అంటారు.
శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ
శమి వృక్షం దగ్గర అందరూ ఈ శ్లోకం పఠించాలి. ఆ శమి వృక్షం చెంతకు వెళ్ళి పూజ చేసి తులసి కోసినట్టుగా దళాలను కోసుకోవాలి. కొమ్మలు విరిచి నాశనం చేయడం మహా పాపం.
విరాటపర్వంలోని ఘట్టం
శ్మశానంలో ఉన్న పెద్ద శమి వృక్షంపైన అర్జుని గాంఢీవం, భీముడి గద, మిగతా వారి ఆయుధాలని కట్టి ఉంచారట, శమిపైన ఇనుము తుప్పు పట్టదు. అది శ్మశానంలో ఉన్నప్పటికీ పవిత్రమైన వృక్షం కాబట్టి పాండవులు దాన్ని ఎంచుకున్నారు. తిరిగి వారు ఉత్తర గోగ్రహణం సమయంలో ఆ ఆయుధాలు అందుకునే వరకు వాటిని సంరక్షించింది ఆ వృక్ష రూపంలో ఉన్న శక్తి.
ఈ విజయ దశమినాడే రాముడు కూడా దుర్గా దేవి ఆరాధన చేశాడని ప్రతీతి. ఈ అంశం రామాయణంలో కాకుండా, దేవి భాగవతంలో ఉన్నది అని చెబుతారు. అందుకే రాముడు దశ కంఠుడైన రావణుడిని సంహరించి, విజయం సాదించాడని చెబుతారు. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరిక ఆరాధన, తులసి ఆరాధన
విజయ దశమి రోజు శమి ఆరాధన చేయాలి?
ఈ రోజు కుటుంబ సమేతంగా ఉదయం దేవి ఆరాధన శమి ఆరాధన తర్వాత మధ్యాహ్నం బోజనం చేయాలి. మద్యం, మాంసాలను ఈ రోజు తీసుకోకూడదు.
కుటుంబంతో ఆనందంగా గడపడమే పండుగ. ఈ పండుగ ప్రాశస్త్యం తెలుకుని ఆచరిస్తారని భావిస్తూ… అందరికి విజయదశమి శుభాకాంక్షలు.

-చిలుకూరి శ్రీనివాసమూర్తి
జ్యోతిష్య, వాస్తు శాస్త్రజ్ఞులు

