హెచ్. రమేశ్ బాబుని స్పర్శించడమంటే, తెలంగాణ సినీ చరిత్రను తడమటమే! ఆయనతో మాట్లాడటమంటే భారతీయ సినిమాను వీక్షించడమే!! ఆయనతో గడపడమంటే.. ఒకటా, రెండా.. హిందీతోపాటు అనేక భాషల సినిమాలను దర్శించడమే!!! భారతీయ సినిమా గమనాన్ని ముద్దాడటమే!!!!
గద్దర్ అవార్డుల్లో భాగంగా ఉత్తమ సినీ విమర్శక అవార్డునందుకుంటున్న సందర్భంగా అడుగులో *డా.మార్గం* అందిస్తోన్న ప్రత్యేక వ్యాసం.
మిత్రుడు రమేశ్ బాబుతో 25ఏళ్ళ ప్రయాణం. నాగర్ కర్నూలులో నేను వార్త స్టాఫ్ రిపోర్ట్ గా పని చేస్తున్నప్పుడు ఆయన పోస్టు మాస్టర్. రచనాసక్తి, వ్యాసాంగ పరిష్వంగంతో ఆతర్వాత ఆయన సినీ మాస్టర్ అయ్యాడు. మిత్రులు వాగ్గేయకారుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కవి మిత్రుడు వనపట్ల సుబ్బయ్య, రమేశ్, నా లాంటి వాళ్ళెందరికో పరిచయకర్త, సమన్వయకర్త, సంస్కర్త టెలికాం బలరామ్ సార్. వారప్పుడు నాగర్ కర్నూలులో వృత్తి రీత్యా టెలీకాంలో ఉద్యోగిగా ఉండేవారు. ప్రవృత్తి రీత్యా వారు చదువురి. చదించడం వారి పని. స్ఫుర ద్రూపి, స్ఫూర్తి ప్రదాత. ఆయన అందించిన చరిత్ర విజ్ఞానం, వివేచన, విశేష ప్రేరణ. తర్వాత కాలంలో బలరాం సార్ సురవరం ప్రతాప్ రెడ్డి చరిత్రకు సంబంధించిన ఉద్ర్గంథాలను వెలువరించారు. రమేశ్ బాబు 30కి పైగా గ్రంథాలను రచించి, 3,500కు పైగా వ్యాసాలను విరచించి, ఈ ఉగాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డుల్లో భాగంగా ఉత్తమ సినీ చారిత్ర విమర్శక అవార్డునందుకుంటున్నాడు. శుభాకాంక్షలు!

హెచ్. రమేశ్ బాబుని స్పర్శించడమంటే, తెలంగాణ సినీ చరిత్రను తడమటమే. ఆయనతో మాట్లాడటమంటే భారతీయ సినిమాను వీక్షించడమే. ఆయనతో గడపడమంటే.. ఒకటా, రెండా.. హిందీతోపాటు అనేక భాషల సినిమాలను దర్శించడమే. భారతీయ సినిమా గమనాన్ని ముద్దాడటమే.
వెకిలిగా మరుగున పడేసిన, మకిలిగా మాసిపోయేట్లు చేసిన తెలంగాణ సినిమా చరిత్రను సాగరమథనాంలా చిలికి.. వెలికితీసి, దానికి సరైన సుస్థిర స్థానాన్ని చరిత్ర పుటల్లో నిలిప కల్పించి, తన జీవితాన్నే అంకితం చేసిన నిఖార్సైన తెలంగాణ పోరు బిడ్డ, అరుదైన రచయిత, విమర్శకుడు, బహుగ్రంథకర్త, పరిశోధకుడు హెచ్. రమేష్ బాబు. సాధారణంగా పదవీ విరమణ తర్వాత విశ్రాంత జీవితాన్ని ఎంచుకునే కాలంలో, ఆయన మాత్రం తన జీవిత లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించుకొని, చరమాంక సమస్యలను సైతం ఆకలింపు చేసుకుని, అన్వయించుకుని, సినీ చారిత్రక అక్షర యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ఇది కేవలం ఆయన వ్యక్తిగత అభిరుచి మాత్రమే కాదు. ఒక పోరాట ప్రాంతీయ సంస్కృతిని, దాని చలనచిత్ర వారసత్వాన్ని సంరక్షించాలనే బాధ్యతతో కూడిన చైతన్యం.

1966లో నాగర్‌కర్నూలు జిల్లాలో జన్మించిన రమేశ్ బాబు, తన సాహిత్య ప్రయాణాన్ని కవిగా ప్రారంభించారు. ఎం.ఏ తెలుగు చదివిన ఆయన, వృత్తిరీత్యా తపాలా శాఖలో పోస్ట్ మాస్టర్‌గా పనిచేస్తూనే, రచనను తన జీవన విధానంగా మలుచుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కొనసాగుతూ, 30కి పైగా గ్రంథాలను విరచించడం, 3,500కు పైగా వ్యాసాలను రచించడం ఆయన నిత్యకృషి తత్వాన్ని తెలియజేస్తుంది. వాటిలో 2వేలకు పైగా వ్యాసాలు సినిమా రంగానికే చెందినవిగా ఉండటం విశేషం. తెలుగు, తెలంగాణ సినిమాలకే పరిమితం కాకుండా ఇతర భారతీయ భాషా చిత్రాలపై కూడా ఆయన చూపిన ఆసక్తి, విశ్లేషణా దృష్టి ఆయనను ఒక విస్తృత దృక్కోణం కలిగిన విశేష పరిశోధకుడిగా నిలబెట్టాయి.

అయితే, 2001ని రమేశ్ బాబు జీవితాన్నేగాక, సినిమా చరిత్రను మేలి మలుపు తిప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సినిమా చరిత్ర నిర్లక్ష్యానికి గురైందన్న ఆవేదనతో, ఆయన స్వయంగా ఆ రంగంలోకి దిగారు. అందుబాటులో ఉన్న సమాచారం అతి పరిమితమైనప్పటికీ, ఆయన వెనుకడుగు వేయలేదు. పాత పత్రాలు, అరుదైన ఆధారాలు, మౌఖిక చరిత్రలు సేకరించి, తెలంగాణ సినిమా మూలాలను పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన కీలక ఆవిష్కరణలు చలనచిత్ర చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.

తెలుగు, తెలంగాణ, భారతీయ సినిమా చరిత్రలో మరుగున పడిన అనేక మైలు రాళ్ళను ఆయన తన పరిశోధనా పటిమతో ఆవిష్కరించారు.1896లోనే హైదరాబాద్‌లో ‘పీప్-హోల్’ సినిమా ప్రదర్శనలు జరిగాయని నిరూపించారు. 1928 నుండి 1957 మధ్యకాలంలో ‘పుష్ కార్ట్ సినిమా’ వంటి వినూత్న ప్రదర్శన విధానాలు ప్రాచుర్యంలో ఉన్నాయని ఆధారాలతో చూపించారు. సినిమా కేవలం వినోదం మాత్రమే కాదని, అది ఒక సామాజిక పరిణామ క్రమంలో భాగమని స్పష్టం చేశారు. తెలంగాణలో సినిమా ప్రజల జీవితాల్లోకి ఎలా ప్రవేశించింది? ఎలా అభివృద్ధి చెందింది? అన్నది ఆయన పరిశోధన సుస్పష్టం చేసింది.

రమేశ్ బాబు విరచిత ‘లోటస్ ఫిల్మ్ కంపెనీ – హైదరాబాద్’ గ్రంథం నిజాం కాలం నాటి మూకీ సినిమాల చరిత్రను వెలుగులోకి తెచ్చిన అరుదైన కృషిగా నిలిచింది. ‘మహానటి సావిత్రి’, ‘ఫాల్కే అవార్డు విజేతలు’, ‘కాంచనమాల’, ‘తొలినాటి సినిమా పాటల పుస్తకములు’ వంటి గ్రంథాలు ఆయన సాహిత్య సంపదను ప్రతిబింబిస్తాయి. అలాగే మరికొందరు సినీ ప్రముఖులపై ఆయన చేసిన రచనలు, సినిమా చరిత్రను సమగ్రంగా అర్థం చేసుకునే దిశగా కీలకంగా మారాయి.

జాతీయ స్థాయి వేదికలపై కూడా ఆయన తన పరిశోధన ఫలితాలను ప్రదర్శించారు. 2015లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జరిగిన సెమినార్‌లో ఆయన చేసిన ప్రసంగం, తెలంగాణ సినిమా చరిత్రపై ఉన్న అపోహలను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ విధంగా ఆయన పరిశోధన కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, చర్చల ద్వారా కూడా విస్తరించింది.

రమేశ్ బాబు కృషికి పలు పురస్కారాలు దక్కాయి. నెహ్రూ యువ అవార్డు, తెలంగాణ రాష్ట్ర ప్రతిభా పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ ఉత్తమ పుస్తక అవార్డు వంటి గుర్తింపులు ఆయన ప్రయాణాన్ని మరింత ప్రాముఖ్యతతో నిలబెట్టాయి. ఇవి వ్యక్తిగత గౌరవాలే కాకుండా, తెలంగాణ సినిమా చరిత్ర పరిశోధనకు లభించిన గౌరవంగా భావించాలి.
హెచ్. రమేశ్ బాబు ప్రస్తుతం లక్ష్యం తెలంగాణ సినిమా చరిత్రను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సమగ్రంగా రెండు భాగాలుగా వెలువరించడం. మొదటి భాగం ఇప్పటికే వెలువడగా, తదుపరి భాగాలపై ఆయన కృషి కొనసాగుతోంది. పెన్షన్ వంటి భద్రతను కూడా వదులుకుని, పూర్తిస్థాయిలో పరిశోధనకు అంకితమవడం ఆయన సంకల్పానికి నిదర్శనం.

ఇలాంటి వ్యక్తుల కృషి వల్లే భారతీయ చరిత్ర సజీవంగా నిలుస్తోంది. తెలంగాణ సినిమా ఉన్నంతకాలం, దాని మూలాలను వెలికితీసి భద్రపరిచిన రమేష్ బాబు పేరు కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన సంకల్పం, ప్రయాణం, అంకితభావం, పట్టుదల, చరిత్ర, సంప్రదాయ, సామాజిక, సాంస్కృతిక బాధ్యతల సమ్మేళనం. హ్యాట్సాఫ్ రమేశ్ బాబు!


