ఒక ‘ప్రభంజనం’ ఆగిపోయింది. నిరంతరం ప్రశ్నించిన ఆ గొంతు మూగబోయింది. బతికినంత కాలం సామాజిక న్యాయం కోసం కొట్టుకున్న ఆ గుండె ఆగిపోయినా, ఇంకా ‘మేమెంతో మాకంత వాటా!’ అంటూ బహుజనుల కోసం కొట్టుమిట్టాడుతూనే ఉంది.
ప్రభంజన్ పని సంస్కృతిని గౌరవించిన నిత్య కృషీవలుడు.
నికార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం తన కలాన్ని, గళాన్ని అంకితం చేసినవాడు. ఎన్నో ఉద్యమాలకు పురుడుపోసిన సృష్టికర్త. అనేక ఉద్యమాలకు ఊపరిలూదిన వాడు.
నిత్య విద్యార్థి, ఉపాధ్యాయుడు, ఉద్యమకారుడు, భాషావేత్త, సామాజిక వేత్త. సామాజిక శాస్త్రవేత్త. సామాజిక ఉద్యమకారుడు, ఆచార్యుడు, పరిశోధకుడు, పాత్రికేయుడు, రచయిత, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. అకుంఠిత దీక్షాదక్షుడు. పాలకుర్తి పౌరుషం. గూడూరు మట్టి పరిమళం. దేశం గర్వించదగ్గ తెలంగాణ కీర్తి పతాక.
ప్రభంజన్ కు అత్యంత సన్నిహితులు, ప్రముఖ బహుభాషావేత్త, విశిష్ట సాహిత్య ప్రకర్షకుడు, చరిత్ర కారుడు, పండితుడు, మేధావి, సోమనాథ కళా పీఠం అధ్యక్షుడు, చేయి తిరిగిన వైద్యుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ 2013లో ప్రభంజన్ పుట్టిన రోజు సందర్భంగా వేసిన ప్రత్యేక సంచిక కోసం రాసిన ప్రత్యేక వ్యాసాన్ని అశేష ఆయన అభిమానులు, శిష్యులు, పాఠకుల కోసం అడుగు అందిస్తోంది.
‘ప్రభంజన’మై ప్రభవిల్లిన విశిష్ట విజేత ప్రయాణం!
అది 1994 మార్చి రెండో వారం. పాలకుర్తి గ్రామ పంచాయితీల పది పదిహేను మంది జమైండ్లు. నన్నూ పిలిచిండు డా. ఎనమల్ల యాదయ్య. అప్పుడో వ్యక్తిని “ప్రభంజన్… ప్రభంజన్ కుమార్ యాదవ్… జర్నలిస్టు… గూడూర్” అని పరిచయం చేసిండు.
ప్రభంజన్ పేరు విన్నప్పటి సందీ నా మనసుల ప్రకంపనలు. వినూత్నమైన పేరు. విలక్షణమైన పేరు. అంతకు ముందు ఎప్పుడూ నా పరిచయస్తులల్ల వినని పేరు. అది నాలో ఉత్సుకతను రేకెత్తించింది. కానీ ఈ పేరు నేను అంతకు ముందు ఒక సారి విన్న. ఆ వ్యక్తినీ చూసినట్టు గుర్తు. అది సోమనాథుని అష్ట శత జయంతి ఉత్సవాల అప్పుడు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య పేర్వారం జగన్నాథం చొరవతో 28 ఫిబ్రవరి 1994 నుంచి మూడు రోజుల పాటు పాలకుర్తిల ఉత్సవాలు జరిగినై. గప్పుడు ప్రభంజన్ పేరు మొదటిసారి విన్న. అతన్ని చూసిందీ అప్పుడే.
వెంటనే ఆ దృశ్యం మరో సారి కండ్ల ముందు గిర్రున రీలు తిరిగినట్టు తిరిగింది. అవును. ఈ ప్రభంజన్ ఆ కవి సమ్మేళనంల పాల్గొన్న ప్రభంజనే! కవితావేశమో! నిజంగానే ఆవేశపరుడో! కానీ కవితా పఠనంలో ఆవేశమైతే కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ ఉత్సవాల నిర్వాహణల మా సోమనాథ కళా పీఠం కూడా బాధ్యత తీసుకొన్నందు వల్ల నా హడావుడిల ఆయనను సరిగా పట్టించుకో లేదు.
ప్రభంజన్ మల్ల తొందరగనే పాలకుర్తికి వచ్చిండంటే ఏదో విశేషం ఉండే ఉంటది అనుకున్న. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతికి మండల కేంద్రమైన పాలకుర్తిల బహిరంగ సభ ఏర్పాటు చేయాలని వచ్చిండని, గందుకే గ్రామ పంచాయితీలకు ముఖ్యులనుకునే వాళ్లను పిలిపిచ్చిండ్లని తెలిసింది. అప్పటికీ ఇంకా నెల సమయం ఉంది. పశు వైద్యాధికారి యాదయ్యను సమన్వయ కర్తగా వేసి, మిగతా పనులను తలా ఒకటి కేటాయించిండు ప్రభంజన్. వక్తలను పిలిచే బాధ్యత నాది. రాపోలు ఆనంద భాస్కర్, బి ఎస్ రాములు ప్రధాన వక్తలు. అప్పటికి ఇంకా ఉత్తరప్రత్యుత్తరాలతోనే వ్యవహారాలు నడుస్తున్నయి. వాళ్లిద్దరికి ఉత్తరాలు రాసిన. వస్తనన్నరు.
అంబేద్కర్ జయంతి అయితే దగ్గర పడుతున్నది. కానీ అనుకున్నట్లు ఏర్పాట్లలో పురోగతి ఏమి కనిపించ లేదు. పోయి డా. యాదయ్యను కలిసిన. “ఏం లేదు డాక్టర్ సాబ్. ఎవ్వలు పట్టించుకుంట లేరు” అన్నడు. నాకు ఆందోళన. వక్తలను పిలిస్తి కదా! ఎట్లా? ప్రభంజన్ మల్లా వచ్చిండు. చైతన్య స్థాయిల అంతరం ఉన్నందు వల్ల మిగతా వాళ్లు పట్టించుకోలేదని తనే సముదాయించిండు. సభ రద్దయిందని ఆ తెల్లారే ఆనంద భాస్కర్ కు , బిఎస్ కు టెలిగ్రామ్ ఇచ్చిన.
సమయాన్ని సద్వినియోగం చేసుకునే జర్నలిస్టు దృష్టి ప్రభంజన్ ది. కవి సమ్మేళనంల పరిచయమైన సహజ కవి మామిండ్ల సాయిలును పిలిపించమన్నడు. జానపద బ్రహ్మ బిరుదాంకితుడు సాయిలు. మేకల కాస్తూ రాత్రి పూట చదువు నేర్చుకున్నడు. ప్రతిభతో కైకట్టి పాటలు అల్లిండు. కవిత్వం రాసిండు. ఆరోజు ఆయనను ఇంటర్వ్యూ చేసిండు ప్రభంజన్. పాశం యాదగిరి సారథ్యంల వెలువడుతున్న ‘వర్తమానం’ దిన పత్రికల ఆ ఇంటర్వ్యూ “మట్టిల మాణిక్యం మామిండ్ల సాయిలు” అనే శీర్షికతో అచ్చయింది.
ఆ ఇంటర్వ్యూ అయిపోయే వరకు చీకటయింది. ఆ రోజులల్ల రవాణ సౌకర్యాలు ఇప్పటంతగా లేవు. ఆ రాత్రి మా ఇంట్లనే ఉండమన్న. మేమిద్దరం ఎక్కువ సేపు కలిసి ఉండే అవకాశం దొరికింది. ప్రభంజన్ పేరు విన్నప్పటి సందీ ఆయన గురించీ తెలుసుకోవాలన్న నాలో ఉత్సుకత. చొరవ తీసుకొని ప్రస్తావించిన. చెప్పిండు. అసలు పేరు యాదనాల మల్లయ్య. గొల్లల కుల దైవం మల్లయ్య. హిందూ బ్రాహ్మణీయ నిచ్చెన మెట్ల కుల సమాజంల ‘మల్లయ్య’ అనే పేరుకు సరైన గౌరవం లేదు. అది దేవుని పేరైనా ‘గొల్ల మల్లయ్య’ గానే గుర్తింపు. అందుకే ప్రభంజన్ గా పేరు మార్చుకున్ననని వివరించిండు. అంతే కాదు, అది ఉద్యమం ఆయనకు పెట్టిన ముద్దు పేరు కూడా.
అప్పటికే ప్రభంజన్ భాషా శాస్త్రంల, కమ్యూనికేషన్ & జర్నలిజంల మాస్టర్ డిగ్రీలతో పాటు, ఎంఫిల్ పరిశోధన కూడా పూర్తి చేసిండు. ఈనాడు, సుప్రభాతం వంటి పత్రికలల్ల రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం ఉన్నవాడు. విశ్వవిద్యాలయ సమస్యలతో పాటు పలు సామాజిక సమస్యల మీద కలం ఎక్కుపెట్టిన వాడు. ఆ తరువాత ఎప్పుడు గూడూర్ కు వచ్చినా పాలకుర్తికి వచ్చి నన్నుకలిసి పోతుండే వాడు. ఊర్లు తిరిగే ప్రభంజన్, ఊరు దాటని నాకు ఉత్తరాలు కూడా రాస్తుండేది. ప్రతి వ్యక్తిలోనూ ఏదో విశిష్టత ఉంటదిని నమ్ముతడు. అందుకే ప్రతి పరిచయాన్నీ ఆయన పదిలంగా, పదికాలాల పాటు కొనసాగిస్తడు.
డోలు దెబ్బ, దరకమే ఐక్యవేదిక తదితర సామాజిక ఉద్యమాలు ఎన్నిట్ల కీలక పాత్ర పోషించినా ఏనాడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. ప్రభంజన్ చదువును, సామాజిక ఉద్యమాన్ని సమంగా కొనసాగించిండు. 1998ల ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(ఐఐఎస్)కు ఎంపికయ్యిండు. ఆ ఉన్నత ఉద్యోగం చేస్తూనే ఉద్యమ పంథా వదల లేదు. కేంద్రప్రభుత్వ విద్యా ఉద్యోగ రంగాలల్ల ఓబీసీలకు రిజర్వేషన్లు ప్రతిపాదించిన బిందేశ్వరీ ప్రసాద్ మండల్ అంటే ప్రభంజన్ కు ప్రత్యేక అభిమానం. అందుకే మండల్ అసోసియేషన్ ఫర్ సోషల్ జస్టీస్ అండ్ సర్వీస్ మాస్ అనే స్వచ్ఛంద సంస్థ నెలకొల్పిండు. ఎన్నో సామాజిక చైతన్య కార్యక్రమాలు చేసిండు. సమయానికి వైద్యం అందక ఊర్ల తన తండ్రి పాము కాటుకు బలై పోయిన చేదు జ్ఞాపకం. అందుకే మాస్ తరపున గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పిండు. ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసుడుతో పాటు ప్రతి ఆదివారం క్లినిక్ నిర్వహించి ఊరోళ్లకు ఎంతో ఉపకరించిండు.
ప్రభంజన్ సొంత ఊరు గూడూరు. కామసాని శాసనంతో చరిత్ర కెక్కిన ఊరు. జనాలను గడడగడలాడించిన గడీల దొరలకు, సంగం మల్లయ్య, చౌడవరపు విశ్వనాథం వంటి తెలంగాణ విమోచన యోధులకు, ఆగడాల ఆ గడీలను నేలమట్టం చేసిన నక్సలైట్ అన్నలకు ఆ ఊరు నెలవు. ఇప్పటి వరకు ఆ ఊరి నుంచి ఆల్ ఇండియా సర్వీస్ కు ఎంపికైందీ ఒక్క ప్రభంజనే.
పదో తరగతిలో సర్వ ప్రథములుగా ఉత్తీర్ణులైన వారికి స్వర్ణ పతకం ఇస్తనన్నడు ఆ గూడూరుకే చెందిన చుక్క రామయ్య. ప్రతిభ ఉన్నవాళ్లను గుర్తించేకన్నా, ప్రతి ఒక్కరినీ ప్రతిభా వంతులుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభంజన్ తలంపు. గూడూరుల సత్యశోధక విద్యా పీఠం అని బడి పెట్టిండు. ఫూలె అంబేద్కర్ ఆలోచనలను, ఆచరణను ఆకలింపు చేసుకున్న వ్యక్తి కదా మన ప్రభంజన్. వివిధ రంగాల్ల నిష్ణాతులను, విషయ పరిజ్ఞానం, నైపుణ్యం గల వాళ్లతో ఉపన్యాసలు ఇప్పించి విద్యార్థులకు అవగాహన పెంచిండు. తల్లిదండ్రులకు చైతన్యం పంచిండు.
ఊర్ల మూతులు నాకే లాలూచి వర్గానికి ప్రభంజన్ తో లాభం కలుగ లేదు. వాళ్లు ఆశించిన ప్రయోజనం నెరవేర లేదు. పనికట్టుకొని దుష్ప్రచారం చేసిండ్లు. దాంతో గొర్రె దాటు జనంతో ప్రభంజన్ కు పొసగ లేదు. ఇంతల్నేఆయన ఉద్యోగం ఢిల్లీకి బదిలీ అయింది. దాంతో మాస్, సత్యశోధక విద్యాపీఠం కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచి పోయినై. అయినా సత్యశోధక విద్యాపీఠంను తన ప్రచురణల ద్వార సజీవంగానే ఉంచ గలుగుతున్నడు.
మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ గా సుమారు ఎనిమిదేండ్లు పనిచేసిండు. ప్రభుత్వ అభివృధ్ధి సంక్షేమ పథకాలన్నీ ప్రజల భాషల వివరించి అవగాహన కల్పించిండు. గణపతి నవరాత్రులు, జాతరల వంటి ప్రతి సందర్భాన్నీ ప్రభుత్వ పథకాల ప్రచారానికి సద్వినియోగం చేసుకున్నడు. ఉపాధ్యాయ, ఉపాధి, పోలీసు శిక్షణ సంస్థలు, మహిళా ప్రాంగణం వంటి ఎన్నో వేదికలపై ప్రభంజన్ ప్రేరణాత్మక ప్రసంగాలు చేసిండు. ఉద్యోగ బాధ్యతలో భాగంగా రాసిన స్ఫూర్తి కథనాలు యధార్థ విజయ గాథలు.
గెస్ట్ ఫ్యాకల్టీ గా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంల ఇంగ్లీష్, పబ్లిక్ రిలేషన్స్, డెవలప్మెంట్ కమ్యూనికేషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయంల జర్నలిజం బోధించి విద్యార్థుల మన్నలను పొందిండు. కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా పాఠశాల నిర్వహిస్తున్న కమ్యూనికేషన్ & జర్నలిజంల కోర్స్ కు కోఆర్డినేటర్, గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసండు. నిజంగా చేసిన కృషి, వచ్చిన గుర్తింపు ఆయన దార్శనికతకు, జర్నలిజం పట్ల మమకారానికి నిదర్శనం. ప్రభంజన్ కృషిని అప్పటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చంద్రకాంత్ కొకాటే, డైరెక్టర్ ప్రొఫెసర్ లింగమూర్తి, విద్యార్థులు, బయట జర్నలిస్టులు శభాష్ అని మెచ్చుకున్నరు. ప్రశంసలు, అభినందనల వర్షం కురిపించిండ్లు. అది ఆయనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. బాధ్యతను ఇనుమడింప చేసింది. కానీ వీర విప్లవ వాదులం, ప్రగతికాముకలం అని చెప్పుకునే కొంతమంది బ్రాహ్మణ, రెడ్డి కులాలకు చెందిన జర్నలిస్టులు ఓర్వలేక బ్లాక్ మేయిల్ చేసిండ్లు. దాంతో కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా పాఠశాల కమ్యూనికేషన్ & జర్నలిజంల విద్యార్థలకు తీరని లోటు, అన్యాయం జరిగిందని చెప్పక తప్పదు.
ఢిల్లీల మకన్ లాల్ పత్రికా రచన విశ్వవిద్యాలయం, పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయం కమ్యూనికేషన్ & జర్నలిజం కోర్సులకు కూడా ప్రభంజన్ గెస్ట్ ఫ్యాకల్టీగా సేవలు అందించిండు. నిబధ్దతకు, కృషికి ప్రభంజన్ ప్రతీకగా నిలిచిండు. ఎక్కడ పనిచేసినా ప్రశంసలతో పాటు ఈర్శ్య అసూయలను కూడా మూట కట్టుకున్నడు. ఓర్వలేని సంకుచితి స్వభావులైన సహొద్యోగుల, సహచరుల, ఇతరేతరుల కుట్రలు కుతంత్రాలకు ఆయన మూల్యమూ చెల్లించిండు.
ప్రభంజన్ అమ్మమ్మ ఊరు కూనూరు. పుట్టి పెరిగిందీ, బాల్యంల ఎక్కువ కాలం గడిపిందీ కూనూర్లనే. పదోతరగతి వరకు అక్కడే చదివిండు. 2001 జనవరిల కూనూరు ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించిండు. కరపత్రం రాసుట్ల, ఆర్గనైజ్ చేసుట్ల ఆయన కృషి అభినందనీయం. సుమారు పన్నెండు వందల మందికి పైగా హాజరైండ్లు. కూనూరు పూర్వ విద్యార్థుల స్పందన, అనుభూతి అద్భుతం. బాల్య మిత్రులను, బడిలోని మిత్రులను కూడగొట్టినందుకు ప్రభంజన్ మీద కృతజ్ఞల జల్లులు కురిసినై. నిజంగా ఆ పూర్వ విద్యార్థుల మేళ అపూర్వమే.
ప్రభంజన్ నాస్తిక సమాజం సభ్యుడు. అయనా ఆస్తికులను, ఆస్తికత్వంలోని మంచి తనాన్ని గౌరం భావంతో చూస్తడు. ఎందరో హిందూ. క్రైస్తవ, ముస్లీం మిత్రులు ఆయనకు అభిమాన పాత్రులు. దళిత, బహుజన వాదియైనా బ్రాహ్మణీయతలోని ఆధిపత్యాన్ని, కుల బ్రాహ్మణులలోని అభిజాత్యాన్ని మాత్రమే నిరసిస్తడు. ఆయనకు ఎందరో ఆస్తిక, అగ్రకులాల అభిమానులున్నారు.
ప్రభంజన్ పని సంస్కృతిని గౌరవిస్తడు. అందుకు సబ్బండ కులాల గురించి రాసిండు. ఉత్పత్తి, శ్రమకులాల ఔన్నత్యాన్ని చాల ఔచిత్యంగా చాటి చెప్పిండు. పుట్టుక మన ఛాయిస్ కాదన్న సత్యం తెలియ చెప్పిండు. పుట్టిన “గొల్ల కులం గొప్ప సంస్కృతి”ని గొప్పగా చెప్పిండు. పంటకు పెంట, పోషణకు పాడి, మాంసం, మనిషి ఉనికి అవసరమైన ఉన్నిని, చర్మాన్ని అందిస్తున్న గొల్లకురుమల గొప్పతనాన్ని, మూగ జీవాలను కంటిపాపల్లా కాపాడే వైనాన్ని, ఒక్కటి కూడా తప్పిపో్కుండా చూసే గొల్ల లెక్కలను కీర్తిస్తడు. అక్కడికే పరిమితం కాడు. మంచి ఎక్కడ ఉన్నా మెచ్చుకుంటడు. దేవులపల్లి శృతి ‘చదువుల తల్లి’ అని సంబుర పడుతడు. చంద్రశేఖర్, మదన్, చంద్ర మోహన్తో చెట్టా పట్టాలు ఏసుకొని తిరుగుతడు. కలిసి నడుస్తడు. కలిసి రాస్తడు. తేడా వస్తే ‘గొల్ల కూత’ పెట్టనీకీ వెనుకకు పోడు. ‘కొండలంతటి’ వాణ్ణీ బండకేసి ఉతుకుతడు. ప్రభంజన్ విమర్శించినప్పుడు బయటివాడు (ఔట్ గ్రూప్), ప్రశంసించినప్పుడు మనవాడు (ఇన్ గ్రూప్) అనిపిస్తడు. కాని అతనో గీటురాయి మాత్రమే!
ప్రభంజన్ రాసిన ప్రతి అక్షరం ప్రజల పక్షమే. ప్రయోజనం కలిగిందే! బిసిజె ప్రాజెక్ట్ స్టడీల జర్నలిస్టు ‘లేబర్! బట్ హిపోక్రట్’ అని ప్రకటించిండు. ఆ రిపోర్ట్ ను ‘లేబర్! బట్ హిపోక్రట్’ పుస్తకంగా ప్రచురించిండు. జర్నలిజం రంగంల వెట్టిని ఎత్తి చూపే రచన అది. జర్నలిస్టుగా ఆయన రచనలను ‘ప్రభంజన పథం’ అనే పేరుతో, సామాజిక దృక్పథంతో రాసిన కథలను ‘ఆంతర్యం’ అనే పేరుతో ప్రచురించిండు. యాదృచ్ఛికంగా ఆ గ్రంథాల ఆవిష్కరణ సభకు నేనే అధ్యక్షత వహించే అదృష్టం కలిగింది. ప్రతి జర్నలిస్టు, సామాజిక స్పృహ ఉన్న ప్రతి వ్యక్తీ చదివి ప్రేరణ పొంద దగిన పుస్తకం ‘ప్రభంజన పథం’. పాలకుర్తి వాసవి, వనితా క్లబ్ లు వరుసగా 2005, 2006 ల ‘బెస్ట్ జర్నలిస్టు’గా గుర్తించి ప్రకటించినై. ఘనంగా సన్మానించి సత్కరించినై.
జానపద కళారూపాలను జన నాట్య మండలి ఉద్యమ కళారూపాలుగా వాడుకున్న వైనం మీద ఆయన ఎంఫిల్ పరిశోథన. దాని గురించి గద్దర్ తో పాటు అజ్ఞాత కళకారులు సంజీవ్, దివాకర్, రమేష్, ఈవి, పద్మ, కుమారి తదిరుల కృషి మీద పరిశోథన చేసి ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్’గా వెలుగులోకి తెచ్చిండు.
అవమానాలను సవాళ్లుగా స్వీకరించే తత్వం ప్రభంజన్ ది. తేడా వస్తే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎప్పటికైనా ‘ప్రశ్నించే’ తత్వం. ప్రశ్నను ప్రేమిస్తడు. ఎన్ని ప్రశ్నలైనా వేస్తడు. ఆ ప్రశ్నల నుంచే నేర్చుకుంటడు. ప్రశ్నించుడుతోనే జ్ఞానాన్ని సంపాదించిండు. నిజం చెప్పాలంటే ఆ ప్రశ్నతోనే ప్రభంజన్ ఎదుగుదల. అందుకే ఏకంగా ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉండాలని ఇంగ్లీష్ ల ‘క్వశ్చన్ ఎవర్’ అని మరో పుస్తకం రాసిండు.
అంతే కాదు జర్నలిస్టులకు చూసే కన్ను, రాసే పెన్ను ఉండాలని పాఠం చెప్తడు. అదే ఆయనను సమర శీలిగా తీర్చి దిద్దింది. పోరాట యోధుడిగా రాటుదేల్చింది. ఆ పోరాట గాథనే ‘బియాండ్ ఛాలెంజెస్’ పుస్తకంగా రూపు దిద్దుకుంది. ఓటు ప్రజాస్వామ్యానికి ప్రతీక. ప్రేమకు ప్రతిరూపం అయిన బిడ్డలాంటిది. ఆ ఓటు అమ్ముడు పోయే పరిస్థితి దాపురించిన తీరును చెండాడిండు. ‘నడుస్తున్న చరిత్ర’ను రికార్డు చేసిండు. ఓట్లు మాయి, సీట్లు మీయా అన్న ప్రజాస్వామిక వాదాన్ని జనంలోకి తీసుక పోయేతందుకు ‘బహుజన మీడియా’ తక్షణ అవసరం అంటడు. గ్లోబలైజేషన్ నేపథ్యంల మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా మారే కదా అని ఆందోళన చెందుతడు. ఆవేదనతో ‘కాసుల జ్ఞానం’ బోథ చేయబోతున్నాడు.
ప్రభంజన్ కు చదువు, పరిశోధన పట్ల వల్లమాలిన ప్రేమ. ఉస్మానియా విశ్వవిద్యాలయం కమ్యూనికేషన్ & జర్నలిజం శాఖ పిహెచ్ డి ప్రారంభించిన వెంటనే ప్రవేశం పొందిండు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి జర్నలిజంల ప్రథమ డాక్టరేట్ పొందిండు. ఎంత నేర్చినా ఇంకా నేర్చుకోవాలని తపిస్తుంటడు. తను నేర్చుకుంటనే ఇతరులకూ బోధిస్తడు. ఏ విశ్వవిద్యాలయంల రెగ్యులర్ ఫ్యాకల్టీగా పని చేయకున్నా రెగ్యులర్ వాళ్లతో సమానంగా, కొన్ని సార్లు వాళ్లను అధగమించీ కృషి చేస్తడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల పరిశోధన పత్రాలు రాస్తున్నడు. సమర్పిస్తున్నడు. ప్రచురితమైతానై కూడా. పిహెచ్ డి స్కాలర్స్ కు అధికారికంగా మార్గదర్శనం చేస్తున్నడు. నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయంల అధ్యాపకునిగా ఎంపిక కూడా అయ్యిండు.
ఆరోగ్యం పట్ల కూడా ప్రభంజన్ కు చాల శ్రధ్ధ. హైదరాబాద్ లోని ప్రాంతీయ కుటుంబ సంక్షేమ శిక్షణ కేంద్రంల కమ్యూనికేషన్ ఫ్యాకల్టీగా పనిచేసిండు. భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారిగా కూడా ఆరోగ్య సంబంధ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేసిండు. ఆ ప్రేరణతోనే హెల్త్ కమ్యూనికేషన్ ల పిహెచ్ డి చేసిండు. ఆ పరిశోధనా పత్రాన్ని ‘రీచింగ్ ది అన్ రీచ్ డ్’ పేరుతో పుస్తకమే అచ్చేసిండు.
పాలకుర్తిలోని సోమనాథ కళా పీఠం నుంచి 2006 ల ప్రతిష్టాత్మక సోమనాథ సామాజిక శోధన పురస్కారం స్వీకరించిండు. తదనంతరం నుంచి సోమనాథ కళా పీఠం గౌరవ సలహా మండలి సభ్యునిగా ప్రభంజన్ వ్యవహరిస్తున్నడు.
ప్రభంజన్ కు నాయకత్వ లక్షణాలు ఎక్కువ. రాష్ట్ర యాదవ విద్యార్థి, యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా, రాష్ట్ర యాదవ మేథావుల ఫోరం వ్యవస్థాపక కన్వీనర్ గా, తెలంగాణ గొల్ల కురుమ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా, గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి డోలు దెబ్బ ఉద్యమానికి సలహాదారునిగా వ్యవహరించిండు. భువనగిరి ప్రాంతంల తిరిగి డోలు దెబ్బ ఉద్యమ పాటలు సేకరించిండు. తనూ పాటలు రాసిండు. తనే సంపాదకుడిగా ‘డోలు దెబ్బ’ ఉద్యమ పాటల సంకలనం వెలువరించిండు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్ది కొమురయ్యకు మొదటి సారి చిత్రం గీయించిండు. చిత్రంమే ‘డోలు దెబ్బ’ ఉద్యమ పాటల పుస్తకానికి ముఖచిత్రం అయింది. అనేక సంస్థలు అనేక సందర్భాలల్ల ఆ చిత్రాన్నే నేటికీ వాడుకుంటూనే ఉన్నయి.
దళిత రచయితలు కళాకారులు మేథావుల(దరకమే) ఐక్య వేదిక, భారత నాస్తిక సమాజం, రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం, రాష్ట్ర బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం వంటి సంస్థల్ల నాయకత్వ బాధ్యతలు చేపట్టిండు. రాడికల్ విద్యార్థి, యువజన, బామ్ సెప్ వంటి సంస్థలతో సన్నిహితంగా మెలిగిండు. చాల సంస్థలకు ప్రభంజన్ వ్యవస్థాపకుడు. మరి కొన్నీటికి సలహాదారు. 2006 డిసెంబర్ ల రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం తరపున పాలకుర్తిల మండల స్థాయి రాజకీయ నాయకత్వ శిక్షణ శిబిరం నిర్వహించిండు. అది ఒక చారిత్రక ఘటన. గొప్ప చరిత్రాత్మక విజయం. ప్రభంజన్ గట్టి కార్యసాధకుడు-టాస్క్ మాస్టర్. ప్రాణం పోయినా పరవాలేదు, పట్టి ఇడువొద్దనే రకం. ఎట్లాంటి పనినైనా ‘సాధించే’ దాక వదిలి పెట్టడు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా పాలకుర్తి చౌరస్తాల రెండేండ్ల కింద జరిగింది. దాంట్ల ప్రభంజనే ప్రధాన వక్త. పాలకుర్తిల అంబేద్కర్ జయంతి నిర్వహించాలన్న ఆయన ఆకాంక్ష ఆలస్యంగానైనా నెరవేరింది. గౌతమ బుధ్ధుడు, పాలకుర్కి సోమనాథుడు, బసవేశ్వరుడు, మహాత్మ జ్యోతిరావు ఫూలె. సావిత్రి బాయి ఫూలె, సాహు మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు, బి పి మండల్, కాన్షీరాం, కంచ ఐలయ్య వంటి వాళ్లు ప్రభంజన్ కు ఆదర్శం. ‘రాజ్యాధికారమే సకల సమస్యలకు పరిష్కారం’ అన్న అంబేద్కర్, ‘ఓట్లు మాయి, సీట్లు మీయా? ఇకపై చెల్లదు’ అన్న కాన్షీరాం స్ఫూర్తితో ప్రభంజన్ ఇటీవల ‘పెత్తనం’ కథ రాసిండు. కాన్షీరాం అంకితం ఇచ్చిండు. ఆ ‘పెత్తనం’ కథ తెలుగు సాహిత్యంల ఓ కొత్త మలుపు.
ప్రభంజన్ రచనలల్ల సృజనాత్మకత, వాస్తవికత సమ పాళ్లల్ల ఉంటై. అదే స్థాయిల విశ్లేషణ ఉండి, ప్రామాణికతను సంతరించుకుంటై. ‘పెత్తనం’, ‘నడుస్తున్న చరిత్ర’ వంటి రచనలల్ల ఇది మరింత పాకాన పడింది. పాత్రలకు భావ సారూప్యత ఉన్న వ్యక్తుల పేర్లు పెట్టిన ధైర్యం, పెంకితనం ప్రభంజన్ ది. మొన్న మార్చి 15న కాన్షీరాం జన్మదినాన ‘బహుజన మీడియా: ద నీడ్ ఆఫ్ ది అవర్’ అనే పుస్తకం ఆవిష్కరించిండు. మన మీడియాను మనమే ఏర్పాటు చేసుకొని కాపాడు కోవాల్సిన అవసరాన్ని ఆ పుస్తకం బలంగా చెప్పింది. ప్రభంజన్ పుస్తకాల ముఖచిత్రాలు కూడా భావ స్ఫోరకాలు.
ప్రభంజన్ మీద తాత(తల్లితండ్రి) బెల్లి కొంరయ్య యాదవ్, అమ్మమ్మ బెల్లి పాప యాదవ్ ప్రభావం ప్రముఖంగా ఉంది. వాళ్ల వ్యవహార దక్షత, తార్కిక ఆలోచనా ధోరణి లక్షణంగా ప్రభంజన్ కు ఒంట బట్టినై. తన తండ్రి యాదనాల సోమయ్య కష్టజీవి. “బిడ్డా! కష్టం చేసి బతకాలె. దొరల్లాగ దోచుక తినొద్దు. బాపనోళ్లలాగ అడుక్క తినొద్దు” అని ఒక సందర్భంల తండ్రి సామెత చెప్పిండు. ‘ఉస్మానియాను ఏం ఉద్దరిత్తిరి?’ అన్న కవితల ఆ సామెతను ప్రభంజన్ సందర్భోచితంగా వాడిండు. అయ్య చెప్పిన సామెతను ప్రభంజన్ ఈ రోజుకు యాది చేసుకుంటడు. అందుకే ప్రభంజన్ కష్టానికి వెరవడు. వెనకడుగు వేయడు.
తెలంగాణ బిడ్డగా ప్రభంజన్ నికార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ పేరుతో చాల సంస్థలకు పురుడు పోసిండు. హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంల న్యూస్ ఎడిటర్ గా పని చేసిండు. తెలంగాణ ఉద్యమ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చిండు. ఢిల్లీ వార్తా విభాగంల న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తూ అదే స్ఫూర్తిని కొనసాగించిండు. ఆంధ్ర భాషాధిపత్యాన్ని ధిక్కరించి, తెలంగాణ భాషలనే రాస్తున్నడు. ఢిల్లీల తెలంగాణ జెఎసి ఏర్పాటుల కీలక భూమికను పోషించిండు. ఢిల్లీ తెలంగాణ జెఎసిల అగ్రకుల ఆధిపత్యానికి అడ్డు తగిలిండు. కో కన్వీనర్ గా ఎంపిక అయ్యిండు. అగ్రకుల ఆధిపత్య ధోరణికి, కుట్రలకు, కుతంత్రాలకు, వంచనకు అసలే తల వంచడు. అవసరమైతే తల తీయనీకి సిధ్ధమే నంటడు.
సుమారు రెండేండ్ల కింద తెలంగాణ జర్నలిస్టులు భారీగా ఢిల్లీకి తరలి పోయిండ్లు. మూడు రోజులు నిరసన కార్యక్రమాలు నిర్వహించిండ్లు. పార్లమెంట్ ను ముట్టడించిండ్లు. కానీ ఢిల్లీ స్థాయిల ఉన్న ‘జాతీయ మీడియా’ అని చెప్పుకుంటున్న ‘ఇంగ్లీష్, హిందీ మీడియా’ స్పందించలేదు. జాతీయ మీడియాకు న్యూస్ ‘సెన్స్’ లేదని ప్రభంజన్ స్పందించి, రాసిండు. జాతీయ మీడియా పక్షపాతాన్ని ఎండగట్టిండు. “రాజకీయ, సామాజిక ఉద్యమాలు & కమ్యూనికేషన్: తెలంగాణ ప్రస్థావన” అని ఆయన పరిశోధనాత్మక వ్యాసం రాసిండు. తెలంగాణ డాట్ కామ్ వెబ్ సైట్ ల ఆ వ్యాసం పెట్టిండు. కావాలంటే చూడొచ్చు.
ఈ విధంగా తెలంగాణ కోసం తన కలాన్ని, గళాన్ని అంకితం చేసిండు ప్రభంజన్. ఇప్పుడు తెలంగాణ కోసం జీవితాన్నే అంకితం చేయనున్నడు. కష్టపడి సాధించిన ఉద్యోగాన్నీ త్యాగం చేసి, ప్రత్యక్ష ఉద్యమంల పాల్గోవాలని నిర్ణయించు కున్నడు. వారించినా వింటలేడు. జీతం కోసం కాదు, ప్రజాస్వామిక బహుజన తెలంగాణ కోసం జీవిస్త నంటడు. బహుజన రాజ్యాస్థాపన కోసం చివరి శ్వాస వరకు రణం చేస్త నంటడు. కానీ రాజీ పడడు. రాజీనామాకు సైతం వెనకడుగు వేయడు. రాజీనామా లేఖ ఎప్పుడూ జేబులనే ఉంటది. ప్రభంజన్ కు పట్టుదలే పెట్టుబడి. ‘కర్తవ్యం’తో కార్యోన్ముఖుడు అయితాండు. ‘సంకల్పం’ మంచిదైతే సగం ‘విజయం’ సాధించినట్టే కదా! ఆత్మీయ మిత్రులుగా ఆయన లక్ష్యసాధనకు మనమూ ‘చేయూత’ నిద్దాం.
అర శతాబ్ది జీవితంల ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నడు. అయినా అకుంఠిత దీక్షతో విజయాలు సాధించుకుంటూ మునుముందుకు సాగి పోతున్నడు. గట్లాంటి మన ప్రభంజన్ కు హృదయ పూర్వక అభినందనలు. జన్మదిన శుభాకాంక్షలు. ప్రభంజన్ నిజంగా నువ్వో స్వయం శక్తి విశిష్ట విజేతవి. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్షు అర్థాయుష్షు అయింది. అనుకోని అతిథిలా అనారోగ్యం కబళించింది. అయితే ప్రభంజన్ దార్శనికత, చిరకాల కీర్తి మనల్ని అనునిత్యం మనల్ని ముందుకు నడుపుతూనే ఉంటుంది.

-డాక్టర్ రాపోలు సత్య నారాయణ
తేది 18-03-2013, పాలకుర్తి
మొబైల్ 09440163211
ఈ మెయిల్ snrapolu@yahoo.co.in

