మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు.అందులో భాగంగా ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, రాష్ట్రానికి దాని భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరిపామని, ఈ సమావేశం ఒకరిద్దరు వ్యక్తుల చాటుగా జరిగిన వ్యవహారం కాదని స్పష్టంగా తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి సంకల్పమని, దానికి పరిశ్రమ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని దిల్ రాజు అన్నారు. ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల సినీ ప్రతినిధులందరూ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. అయితే, పరిశ్రమపై అనవసర వివాదాలు రేకెత్తించడం అనుచితమని, రాజకీయ దాడి-ప్రతిదాడులకు సినీ పరిశ్రమను వాడుకోవద్దని కోరారు.
తెలుగు చిత్ర పరిశ్రమ లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోందని, దానికి ప్రభుత్వాల సహకారం ఎప్పటికీ అవసరమని దిల్ రాజు అన్నారు. పరిశ్రమపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని, ప్రజలందరి ప్రోత్సాహం పరిశ్రమకు ఎప్పటికీ కీలకమని అభిప్రాయపడ్డారు.

