ఆమె
స్వేద బిందువులే
పంటగింజలకు తడి
ఆమె నవ్వులే
ఇంటికి తోరణాలు
ఆమె ఆలోచనలే
అభివృద్ధికి సంకేతాలు
అర్దశతాబ్దయినా
భూగోళమంతా రక్తపు దారలే !
ఆవిష్కరణలకు
ఆమెనే ఉగాది
అక్రమ రవాణకు
అమెనే ఎగుమతి దిగుమతి
అంగట్లో సరుకు బొమ్మ ఆమెనే
అందాల పోటీలకు ఆమెనే నమూనా
దేహం నిండా తూట్లు
కత్తులు మాత్రం నూతనం
ఆమె
చేతిలో ఆయుధమున్నా నిస్సాహయురాలు
పురుషాధిక్యత అహంకారంలో
అనుమాన శాడిజాలతో
కుక్కర్ లో ముక్కలు ముక్కలవుతున్నారు
మోసపు మాటలకు బలౌవుతున్నారు
ఆమెనే అమ్మ
అక్కా, చెల్లెలు ఇల్లాలూ
ఆమెనే తొలి ఉపాద్యాయురాలు
ఆదిశక్తి పరాశక్తి భధ్రకాలి
సమ్మక్క సారక్క
ఆమెనే బతుకమ్మ
ఆమెనే ఇంద్రధనుస్సు
ఆమెనే అంతరిక్షం
ఆమెనే పాలపుంత
అబల కాదు సబల
వంచించే నాగరికత ఎంతుంటేమి
అవని లేని ఉదయాలెన్నుంటేమి
ఒంటరిగా నడిచే నాగరికత రావాలి కావాలి
అర్ధరాత్రి స్వేచ్ఛా గీతమై ప్రతిధ్వనించాలి
ఆమె కను తెరిస్తే
గద్దలై పొడుస్తారు
ఆమె
ఆటాడి పాటెత్తుకుంటే
కళ్లు పొడుచుకొస్తాయి
ఆమె
కవిత్వమైతే
కవ్విస్తారు, కామిస్తారు
ఆమె
కోయిలై గానమెత్తకుండా
రాబంధుల రెక్కల చప్పుళ్ళు
ఆమెనే
సూర్యుడికి తల్లి
సిద్దార్థుడికి తల్లి
కర్ణుడికి తల్లి
యేసుకు తల్లి
నకుల సహదేవులకు తల్లి
రావణ బ్రహ్మకు తల్లి
ఆమె
జన్మనివ్వని బిడ్డలుండరా
ఆమె కన్నీళ్లు పెట్టని చోటుంటదా ?
ఆమె
వాడి విసిరేసే పనిముట్టు కాదు
దరించి పారేసే వస్త్రం కాదు
మసిగుడ్డ అసలే కాదు
ఆమె రాత
రామాయణం
ఆమెనడక
ఆదర్శనీయం
ఆమె సేవలకు
ప్రతిరూపం
ఆమెను చూస్తే
యాసిడ్ కు కళ్లొస్తాయి
పెట్రోలుకు చేతులొస్తాయి
వరకట్నపు కత్తులు పదునెక్కుతాయి
పరువు హత్యలు కోరలు చాస్తాయి
ఆమె
బొట్టు బోనమైంది కానీ
ఆమె బతుకు చిద్రమైంది
కలెక్టరైనా,పోలీసైనా పొలిటీషియనైనా
డాక్టరైనాయాక్టరైనా
న్యాయమూర్తైనా
విధుల దగ్గర వేధింపుల కాలనాగులు
బ్రతుకు దగ్గర కామపు కత్తులు
కులాలన్ని
ఆమెను పొడిచే కాకులే
మతాలన్నీ
ఆమెను తగులబెట్టె కొయ్యలే
పురుగుల్లా
ఆమెను నలిపేసే మదాంధులే
ఆమె అవని
పసిపాపలా నవ్వాలి
హిమశిఖరంలా ఎదుగాలి
విజయోత్సవమై నడువాలి
జాతీయ పతాకమై ఎగరాలి
ఆమెనే అభ్యుదయం
ఆమెనే వికాసం
ఆమెనే వెలుగు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

9492765358

