POLITICAL PARTIES| రాజకీయ పార్టీలతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాస్వామ్యయుత వాతావరణం పార్టీల్లో ఉంటేనే, ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. రాజకీయ పరిస్థితులను బట్టే ఆయా రాజ్యాల్లో, దేశాల్లో, సమాజాల్లో మిగతా అన్ని పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థ ఏదైనా ఇవ్వాళ ఒక ప్రజాస్వామ్యానికే చోటుంది. మన దేశానికి వస్తే మనది సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర, స్వాతంత్ర్య, సమైక్య నినాదం కలిగిన లౌకిక రాజ్యాంగం. మనం లిఖించుకున్న రాజ్యాంగాన్ననుసరించి, పార్టీలు, ప్రభుత్వాలు, పాలన సాగుతున్నది. మన వ్యవస్థననుసరించి మన రాజకీయ పార్టీలు కూడా ప్రజాస్వామికంగానే నడుచుకుంటున్నాయి. అయితే పార్టీల్లోనూ అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉంటేనే, ప్రజలు ఆయా పార్టీలను ఆదరిస్తారు. అందలమెక్కిస్తారు.
INDIA| భారతదేశం పునాదులే ప్రజాస్వామిక వ్యవస్థపై ఆధారపడి ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఇదే విధానం అవలంబించి, ప్రజల్లో ఉన్నంతకాలమే మనగలుగుతాయి. అలాకాకుండా ఏకపక్ష, నిరపేక్ష, నిరంకుశ, కుటుంబ పాలనకు తెగబడితే అవి కాలక్రమంలో తెరమరుగవుతాయి. స్వాతంత్ర్యానికి ముందే మన దేశంలో పలు పార్టీలు ఆవిర్భవించాయి. 1885 డిసెంబరు 28 న స్థాపితమైన కాంగ్రెస్ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబరు 26, 1925 స్థాపించబడింది. 1964లో దీనిలోని అతివాద వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)గా విడిపోయింది. 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించింది. 1984 ఏప్రిల్ 14న బహుజన సమాజ్ పార్టీ ఏర్పడింది. దేశంలో 2024 మార్చి 23 నాటికి, 6 జాతీయ పార్టీలు, 58 రాష్ట్ర పార్టీలు ఉన్నాయి. 2,763 ఇతర గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయి. భారత ఎన్నికల సంఘం కొన్న ప్రామాణికాల ఆధారంగా పార్టీల గుర్తింపు, హోదా, ఎన్నికల గుర్తు వంటివి కేటాయిస్తుంది. కాలక్రమంలో కొన్ని జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల స్థాయికి, కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల స్థాయికి ప్రజాదరణను బట్టి చేరాయి. పార్టీలు తమ లక్షణాలు, లక్ష్యాలు, ఆశయాలు, నడవడికను బట్టి ప్రజాదరణను పొందుతున్నాయి.
ఒక్కో సందర్భంలో ఒక్కో పార్టీ దేశ, రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేశాయి. జాతీయోద్యమంలో ఉదారవాదంలో కాంగ్రెస్, ప్రజా ఉద్యమాల్లో కమ్యూనిస్టు పార్టీలు, నయా ఉదారవాదం, హిందూ జాతీయ వాద భావజాలంతో బీజేపీ, బహుజన సామాజిక న్యాయ వాదంతో బీఎస్పీ, సంక్షేమ, ప్రజాభిప్రాయవాదంతో ఆమ్ ఆద్మీపార్టీ, తెలుగువారి ఆత్మగౌరవంతో తెలుగుదేశం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నినాదంతో భారత రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ ఆశయసాధన కోసం వైసీపీ, సామాజిక న్యాయం కోసం జనసేన, ముస్లీంల హక్కుల పరిరక్షణకు ఎంఐఎం లాంటి అనేక గుర్తింపు ఉన్న, గుర్తింపు లేని మరెన్నో పార్టీలు ఆవిర్భవించాయి.
రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారం. ప్రజాభిమానాన్ని చూరగొనడం ద్వారా, ఎన్నికల్లో గెలిచి, అధికారాన్ని దక్కించుకోవడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయడం వాటి విధి. ప్రజల ఓట్ల కోసం అనేక విధాలుగా పాటుపడటం, ఆకర్షణలు, తాయిలాలు, ఓటర్లను నమ్మించడం, ఏదో విధంగా అధికారంలోకి రావడం కూడా నేడు పరిపాటైపోయింది. అలవిగాని హామీలు, వాటి అమలు కోసం అప్పులు, వాటిని తీర్చడం, వడ్డీలు కట్టడం కోసం మరిన్ని అప్పులు తెచ్చి, ఆ ఊబీలోకి దిగిపోయినవి కూడా ఎన్నో ఉన్నాయి. అలా అధికారంలోకి వచ్చిన పార్టీలు అనతి కలంలోనే కనుమరుగవుతున్నాయి. ఒకటి రెండు సార్లు అధికారంలో రావడానికి ప్రజలు అవకాశాలిచ్చి, ఆ తర్వాత వాటిని విస్మరిస్తున్నారు.
కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఓ ప్రభంజనంలా వచ్చింది. ఎందరో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించింది. తటస్థులు, అధికారులు వంటి వారు రాజకీయావకాశాలు పొందారు. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ హయాంలో కూడా ఉద్యమకారులనేక మంది రాజకీయాల్లోకి వచ్చారు. ఎంఐఎం తన నిర్ణీత పరిమితిలో పని చేస్తున్నది. వైఎస్సార్ మరణాంతరం ఏర్పడిన వైసీపీ విడివడిన ఆంధ్రప్రదేశ్ లో అధకారంలోకి రాగలిగింది. జన సేన అటు జాతీయ బీజేపీ, ఇటు రాష్ట్రీయ తెలుగుదేశంతో కలిసి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగలిగింది. మధ్యలో వచ్చిన ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది. అనేక ఉద్యమ పార్టీలు తెలంగాణలో బీఆర్ఎస్ లో విలీనమయ్యాయి.
అయితే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, అందరికీ అవకాశాలు, ప్రజాదరణను బట్టి అవి మనుగడ సాధించడం, అధికారంలోకి రావడమో జరిగాయి. నిరంకుశంగా, ఉదారంగా వ్యవహరించిన నాయకత్వాల కారణంగా ఆయా పార్టీలు అంతరించడమో, వేరే పార్టీల్లో విలీనమవడమో, ప్రజాదరణ లేక పక్కన పడటమో జరిగిపోయాయి. అయితే పైకి ప్రజాస్వామికంగా కనిపించినా, పార్టీ అంతర్గతంగా ఒక కుటుంబం లేదా ఒక వర్గం లేదా ఒక కులం, ఒక ప్రాంతం ఆధిపత్యం అనివార్యంగా అన్ని పార్టీల్లోనూ అన్ని లక్షణాలు లేదా ఒకటి రెండు లక్షణాలు కనిపిస్తున్నాయి. కేంద్రీక్రుత రాజకీయాలు జాతీయ పార్టీల్లో, ఒకే కుటుంబం లేదా ఏకపక్షత ప్రాంతీయ పార్టీల్లోనూ అధికంగా కనిపిస్తున్నది. ఇలాంటి లక్షణాలు రానురాను పెరిగిపోతున్నాయి. దీని వల్ల పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం సన్నగిల్లిపోతోంది. ఏకస్వామ్యం, ఏక చత్రాధిపత్యం, నియంత్రుత్వం పెరిగిపోతున్నది. ఇలాంటి పార్టీలు బలం ఉన్నంత కాలం, ప్రజాదరణను పొందినంత కాలం, సాగినంత కాలం సాగదీస్తున్నాయి. తర్వాత వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే, దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నిరంతరం కాపాడుతూ, అందరికీ అవకాశాలు కల్పిస్తూ, సామాజిక న్యాయాన్ని అందివ్వగలిగిన పార్టీలు దీర్ఘకాలం ప్రజల్లో ఉంటున్నాయి.
నిరంతరం ప్రజల్లో ఉండేలా పార్టీని నిలపడంలో ఘనత తెలుగుదేశం నాయకత్వం విజయం సాధించింది. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల్లో నిలవడానికి టీడీపీ నాయకత్వం చేస్తున్న కృషిని అభినందించాల్సిందే. అదే తెలంగాణలో బిఆర్‌ఎస్ నిత్యం సంక్షోభాలతో సాగుతోంది. కేసీఆర్ నిరంకుశ విధానాలు ఆ పార్టీని దెబ్బతీసాయి. జగన్ లాగే అప్పులు చేసి, రాష్టాన్న్రి దివాళా తీయించారు. ప్రజలు ఇలాంటి పార్టీ మనకొద్దని ఎన్నికల్లో ఓడించారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ కూడా తన విధానాలు మార్చుకోకుండా ఏడాదిన్నరలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగ్టటుకుంది. బీజేపీలో మోడీ నిరంకుశ విధానాల వల్ల ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోతోంది. గతేడాది ఎన్నికల్లో ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ బెడిసింది. బీజేపీ ఎన్డీఎ భాగస్వామ్య పార్టీలతో గట్టెక్కింది. పార్టీలు వీటిని హెచ్చరికలుగా గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ఏ పార్టీ అయినా మట్టి కరవక మానదు. తాత్కాలిక ఉద్రేకాలతోనో తాయిలాలతోనో ప్రజలు ఎల్లకాలం దీవించరు. దేశమైనా, రాష్ట్రమైనా, రాజకీయ పార్టీలైనా ప్రజాస్వామ్య బద్దంగా సాగాల్సిందే.

