-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA
జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క కుదపుతో ‘పునర్జన్మ’ ముక్తిని పొందితే, కోమాలోకి వెళ్ళిన రాణాకు కోర్టు ‘కారుణ్య’ అనుమతినిచ్చి శాశ్వత జీవ విముక్తిని ప్రసాదించింది! మృత్యువు ఒకరికి అకస్మాత్తుగా దూరమై సంతోషాన్ని నింపితే, మరొకరికి శాశ్వతంగా దగ్గరై ప్రశాంతతను చేకూర్చింది. విధి వింత నాటకంలో కాలం రాసిన ఈ రెండు భిన్నమైన ముగింపులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
బ్రెయిన్ ‘డెడ్’ – ఒక్క కుదపుతో ‘రీ బర్త్’!
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. జిల్లా కోర్టులో పనిచేసే వినితా శుక్లా అనే మహిళ ఫిబ్రవరి 22న తీవ్ర అస్వస్థతకు గురవడంతో, వైద్యులు ఆమెను ‘బ్రెయిన్ డెడ్’గా భావించి, బతికే అవకాశాలు లేవని తేల్చేశారు. దీంతో నిరాశ చెందిన కుటుంబ సభ్యులు అంత్యక్రియల ఏర్పాట్లు చేసి, ఆమెను అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో రోడ్డుపై ఉన్న ఒక పెద్ద గుంట కారణంగా వాహనం భారీ కుదుపునకు గురైంది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న వినిత ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను తిరిగి హాస్పిటల్ కి తరలించారు. ఆమె కోలుకుంటోంది. కుటుంబ సభ్యులు దీన్ని ‘దైవలీల’గా భావిస్తుంటే.. వైద్యులు ‘దవాలీలే‘ అంటున్నారట. ఏది ఏమైనా, చావుకు చేరువైన ఆ మహిళ, తిరిగి ఊపిరి తీసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

‘కోమా’లో ఉన్న రాణాకు కోర్టు ‘కారుణ్యం’!
13 ఏళ్లుగా కోమాలో ఉండి, జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణాకు సుప్రీంకోర్టు కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2013లో చండీగఢ్ వర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతుండగా, నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో హరీశ్ తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. నాటి నుండి అతడు మంచానికే పరిమితమయ్యాడు. ఎన్ని దవాఖానాలు తిరిగినా ఫలితం రాక, కొడుకు నరకాన్ని చూడలేక తల్లిదండ్రులు కారుణ్య మరణం కోసం మూడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ తీర్పుపై హరీశ్ తండ్రి అశోక్ స్పందిస్తూ.. “ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డ చావును కోరుకోరు, కానీ వాడు పడుతున్న బాధ చూడలేకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో టాపర్‌గా ఉన్న కొడుకును పోగొట్టుకోవడం అత్యంత దురదృష్టకరమని, ఈ తీర్పు ఎందరో బాధితులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తమ విన్నపాన్ని మన్నించిన అత్యున్నత న్యాయస్థానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


