మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే ‘క్యాప్సైసిన్’ అనే పదార్థంతోటి కారమైతదట. ఇగ గీ కారంతోటే తొక్కులు, కూరలు, బజ్జీలు, చల్ల మెరపకాయలు శేసుకుంటరు. గిప్పుడు గీ మెరిపకాయెల్తోని ఏం పని? అనుకుంటాండ్లా? మరి గిది గా మెరపకాయెల సీజన్ కదా? గీ సీజన్ల రైతులు మస్తుగ పండిచ్చిన మెరపకాయెల్ని శెలకల్ల ఆరబోత్తరు. ఎంగబెడ్తరు. గిట్ల గీ ఎండబెట్టిన మెరపకాయెల రాసుల్ని ఆకాశంల కేలి యీడియోలు, పోటువలు తీత్తే ఎట్లుంటది?

గీ ఉపాయాన్ని గా కారు మోటర్లను తయారు శేసే, ఆనంద్ మహీంద్ర అనేటాయినె శేసిండు. గుంటూర్ల ఆరబోసిన మెరపకాయెల్ని గాల్లె ఎగిరె కెమెరాతోటి యీడియో తీపిచ్చిండు. గా ఈడియోల్ని తన ఎక్స్ ఖాతల పెట్టిండు. ఇగ గా ఈడియోల, గా మెరపకాయెల రాసులు భూమ్మీద ఆర బోసిన ఓలీ రంగుల్లెక్క ఉన్నయని రాసిండు. గిదీన్ని గా ఏపీ, పర్యాటక ఆకర్షణగ మార్సగలదా? అంటూ, మంత్రి లోకేశ్ కు ట్యాగ్ శేసిండు. ఇగ గీదీన్ని సొషల్ మీడియల నెటిజన్లు సూసి మస్తుగుందని లైకులు కొడతాండ్రు. మన తెలివి తెల్లారా? నిజంగనే, గిదంతా మన దగ్గర్నే ఉన్నది గనీ, గిట్లుంటదని గాయినె శెప్పే దాకా, మనకే తెల్వకపాయె?!

