శెప్పంగ యినకపోతే, శెడంగ సూడాల్నెట! ఇగ గా శెప్పుడు మాటలే కొండీలైతే? ఏమైతది? కొంపలు మున్గుతయి. మంచొల్ల మద్దెల పంచాయితీలైతయి. పెద్ద కొట్లాటలై, పానాల మీదికి కూడ వత్తయి. ఎవల్నైనా ఏమోగనీ, గీ కొండీల తేలుకొండి గాల్లని అదుపు సేయడం శాలా కట్టం. గందుకే గా ఊరోల్లు గా కొండీల పుండాకోర్ల మీద నిషేధం పెట్టిండ్రు.

ఛత్తీస్ గడ్ రాష్ట్రంల మేఢకీ అనే ఊరుంది. గా ఊర్లె గీ మద్దెల గా గాలి ముచ్చట్లతోటి ఊరు ఊరంతా గాలిగాలైతాందట. వాడెవడో శెవి కొరికితే, గీవీడెవడో నోరు జారుడు, శేయి శేసుకునుడు మామూలైపోయింది. ఇగ గిదంత పని కాదని, గా కోండీల పుండాకోర్లపై నిషేధం పెట్టిండ్రు. గసోంటోల్లు దొరికితే, 5 యేల రూపాయల జరిమానా యిధిస్తామన్నరు. గిదే కాదు. ఐదేండ్ల కిందనే గా ఊల్లె తాగుడును నిషేధించిండ్రు. ఎవలైనా మందమ్మితే 10 యేలు, ఇంకా ఎవలైనా తాగి తందనాలాడితే 11 యేలు జరిమానాలు వసూల్ శేత్తాండ్రు. ఇగ మందమ్మేటోల్ల జాడ శెప్పితే సాలు యెయ్యి రూపాయలిస్తాండ్లు. ఊల్లె లొల్లులే ఉండొద్దని గిట్ల శేత్తాండ్లట. మన ఊర్లల్ల గూడ గిట్లనే శేత్తే ఎట్టుంటది? జెర సోచాయించుండ్లి!

