యెనకటికి ఒకపాలి పెండ్లైందంటే ఎన్ని కట్టాలొచ్చినా, కలహాలొచ్చినా, సచ్చేదాకా కలిసే ఉండేది. ఏడడుగులు.. మూడు ముళ్ళు గంత గట్టిగుండేయి. గిప్పుడైతే ఏడడుగులు, మూడు ముళ్ళు పడకముందే గిట్ల పెండ్లైతాంది.. గట్ల పెటాకులైపోతానై. ఇంకా శెప్పాల్నంటే వరపూజలు, పూలుపండ్లు పెండ్లి పీటలెక్కుతలేవు! నిశ్చితార్థం కావంగనే, పోరగాండ్లు పోన్లల్ల మాటలు, శాటింగులు శేసుకుని పెండ్లికి ముందే కటీఫ్ అయితాండ్లట. ఇగ గిదంత పనికాదని చత్తీస్గడ్ రాష్ట్రం బాలోద్ జిల్లాల సేన్ అనే ఓ కులపోల్లు ఓ తీర్మానం శేసిండ్రు.

నిశ్చితార్థం జరిగినంక పెండ్లయ్యేదాక గా పోరగాండ్లు పోన్లల్ల మాట్లాడుకోవద్దు. శాటింగ్ శేయొద్దు. ఒకేల మాట్లాడాల్నంటే గవాల్ల అవ్వయ్యల సమచ్చంలనే మాట్లాడుకోవాలె. ఇగిప్పటికే ప్రీ వెడ్డింగ్ షూట్లను నిషేధించిండ్రు. కుటుంబాలు బాగుండాల్నని గీయన్నీ శేత్తానమని శెప్పిండ్రు. ఏమైనా గీ కట్టుబాట్లు కట్టుదిట్టంగా బాగున్నయి. పెండ్లిల్లు నిలబడి, కుటుంబాలు బాగుండే గీ పద్ధతిని అంతా పాటిస్తే బాగుంటది కదా?

