ఇగిప్పుడైతే దొంగదందాలెక్కువైనయి. టేకులు, గంజాయి, డ్రగ్స్, పశువులు, ఆఖరికి మనుసులను గూడ రవాణా శెయ్యబడ్తిరి. ఎంత సెక్ పోస్టులు, నిఘా, గస్తీలు పెట్టినా, ఏదో దారిల మరేదో తీర్గ పోతనే ఉండబట్టె! మరి గవాట్ని ఎట్ల ఆపాల్నెని ఓ ఉపాయం ఆలోసించిండ్లు.

దబ్బదబ్బ పోయేవాట్ని నిమ్మలంగా పోయేటట్ట శేసేవి.. గవేనుల్లా గా స్పీడు బ్రేకర్లుంటయి గదా! గవాట్ల మద్దెల సిసి కెమెరాలతో ఉండే సెన్సార్లు పెట్టిండ్లు. గాడికి రావంగనే గా మోటర్లు మెల్లగా పోతయి గదా! ఇగ గప్పుడే గా సెన్సార్లు గా మోటార్ల లోపల ఏమున్నదో గుర్తుపడ్తయి. గది గా పక్కనే పెట్టిన కంప్యూటర్ల కనబడ్తది. ఇగ గవాట్ని ఎంటనే ఆపి, పట్టుకోవచ్చు! గా దొంగ దందాను కట్టడిశేయొచ్చు. బాగుంది గదా? గీ ఉపాయం.

