
ఆ ఊరి ప్రజాస్వామ్య కలకు ఎట్టకేలకు నెరవేరింది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓటు వేసినా… సర్పంచ్ ఎన్నికల ఓటు అంటే ఏమిటో తెలియని ఒక గ్రామం, 70 ఏళ్ల తర్వాత తొలిసారి పంచాయతీ ఎన్నికల పండుగను చూసింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీలో ఈ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది.
1956లో ఏర్పడిన ఈ పంచాయతీలో ఇప్పటివరకు ప్రతి ఎన్నిక ఏకగ్రీవంగానే సాగింది. గ్రామ పెద్దల నిర్ణయాలతో సర్పంచ్‌ను ఎన్నుకుంటూ రావడంతో ప్రజలకు ఓటు హక్కు వినియోగించే అవకాశం రాలేదు. అయితే ఈసారి పరిస్థితి మారింది. ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ తప్పదని అభ్యర్థులు బరిలోకి దిగారు. దీంతో ఏడు దశాబ్దాల ఆనవాయితీకి విరామం పడింది.
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బరంపూర్‌లో పోలింగ్ జరగగా, వృద్ధులు ప్రత్యేకంగా సంబరపడ్డారు. పుట్టినప్పటి నుంచి ఇదే మొదటిసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటేశాం అంటూ 70 ఏళ్లు దాటిన ఓటర్లు ఆనందం వ్యక్తం చేశారు.
సుమారు 3 వేల జనాభా, 2,300 ఓటర్లు ఉన్న ఈ పంచాయతీలో బీఆర్ఎస్ మద్దతుతో మెస్రం దేవ్ రావు, కాంగ్రెస్ మద్దతుతో సిడాం లక్ష్మణ్ రావు పోటీ పడ్డారు. చివరికి మెస్రం దేవ్ రావు 300 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం తెలిసిన రోజు ఇదే అంటూ బరంపూర్ చరిత్రలో ఈ ఎన్నిక చిరస్థాయిగా నిలిచింది.

