
ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు శక్తి ఎంత గొప్పదో మరోసారి నిరూపితమైంది. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో వెలువడిన ఫలితం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఓటు విలువను గుర్తు చేసేలా ఈ ఘటన ప్రజలను ఆలోచింపజేస్తోంది.
లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ముత్యాల శ్రీవేద పోటీ చేయగా, ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికాలో నివసిస్తున్నారు. కోడలి గెలుపు కోసం ఆయన నాలుగు రోజుల ముందే అమెరికా నుంచి స్వగ్రామానికి చేరుకొని, ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఒక్క ఓటే చివరకు ఎన్నిక ఫలితాన్ని మలుపు తిప్పడం విశేషం.
సోమవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. గ్రామంలో మొత్తం 426 ఓట్లకు గాను 378 ఓట్లు పోలవ్వగా, శ్రీవేదకు 189 ఓట్లు, ఆమె సమీప ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు లభించాయి. మరో ఓటును అధికారులు చెల్లనిదిగా ప్రకటించడంతో, కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో శ్రీవేద సర్పంచ్‌గా విజయం సాధించారు.
అమెరికా నుంచి వచ్చి వేసిన ఆ ఒక్క ఓటే గెలుపును నిర్ణయించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత కీలకమో మరోసారి గుర్తు చేస్తూ, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది.

