
గా హెల్మెట్ పెట్టుకోకుండా సైకిల్ మోటార్లే నడపొద్దని సర్కార్ చెప్తాంది. మనమేమన్నా ఇంటున్నమా ఏంది? గది లేకుండనే బండ్లు నడుపుతున్నం. యాక్సిడెంట్లైతే పానాలు తీసుకుంటున్నం. ఇగ గిట్ల జరగొద్దని ఓ పొల్లగాడు, స్మార్ట్ హెల్మెట్ ను కనిపెట్టిండు. ఇగ గది తలకాయకు పెట్టుకోకపోత అసలు బండే స్టార్ట్ కాదట.
ఒడిశా రాష్ట్రంల గంజాం జిల్లాల షేడ్ గడ్ అని ఓ ఊరుంది. గా ఊర్లె 9వ తరగతి చదువుతున్న అమిత్ కుమార్ తండ్రి రెండేండ్ల కిందటనే ఓ యాక్సిడెంట్ల పానం పోయింది. ఇగ తన తండ్రికి జరిగినట్లు ఎవ్వలికీ జరగొద్దని ఓ స్మార్ట్ హెల్మెట్ ను కనిపెట్టిండు. బండి ఇంజన్ కు హెల్మెట్ కు సెన్సార్లు పెట్టి, ఓ వైర్ ను అతికిచ్చిండు. ఇగ గా హెల్మెట్ ను తలకు పెట్టుకుంటేనే గా సైకిల్ మోటర్ స్టార్ట్ అయితది. లేకపోతే అస్సలు కాదట. ఇగ గిదీన్ని సూసి అంతా ఔరా! అంటాండ్లు. మరి మీరేమంటరు?

