
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతలఠాణా పంచాయతీలో ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. ఆర్అండ్‌ఆర్ కాలనీకి చెందిన చెర్ల మురళి (50) చికెన్ సెంటర్ నడుపుతూ, గతంలో వార్డు సభ్యుడిగా సేవలందించాడు. ఈసారి సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్ రిజర్వ్‌గా ఉండటంతో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేశారు. ప్రతిరోజూ మద్దతుదారులతో ఉత్సాహంగా ప్రచారం చేస్తూ ఉన్న మురళి ఈ నెల 4న రాత్రి గుండెపోటుతో మరణించాడు. అయినప్పటికీ, ప్రజలు ఆయనపై ఉన్న ప్రేమ, నమ్మకంతో పోలింగ్ రోజు భారీగా ఓటేసి 358 ఓట్ల తేడాతో మురళినే గెలిపించారు. భౌతికంగా లేని అభ్యర్థి గెలవడంతో అధికారులు ఎన్నిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక మళ్లీ ఎన్నిక జరుగుతుందా? లేక ఉపసర్పంచికి బాధ్యతలు అప్పగిస్తారా? అన్నదానిపై గ్రామంలో ఉత్కంఠ నెలకొంది.

