
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ ఈ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఎస్సీ జనరల్‌గా రిజర్వ్ అయిన ఈ పంచాయతీ సర్పంచ్ పదవికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అత్తా–కోడళ్లు నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామంలో రాజకీయ హీట్ పెరిగింది. గతంలో సర్పంచ్‌గా గెలిచిన తొడసం లక్ష్మిబాయి మళ్లీ పోటీలో నిలిచినా, ఆమె కోడలు మహేశ్వరి అత్తకు ప్రత్యర్థిగా నామినేషన్ వేయడం గ్రామంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇదే సమయంలో జాదవ్ కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు — రామ్ లఖన్ సింగ్, కుబేర్ సింగ్, అనార్ సింగ్ కూడా రంగంలోకి దిగడంతో గ్రామ ప్రజలు గందరగోళంలో పడ్డారు. గ్రామస్థులు ఐదుగురిలో ఒక్కరు మాత్రమే పోటీ చేయాలని కోరినప్పటికీ ఎవరూ నామినేషన్ ఉపసంహరించుకోకపోవడంతో ఐదుగురు సభ్యులే తుది పోటీలో నిలిచి హీరాపూర్ పంచాయతీ ఎన్నికలు అపూర్వ రీతిలో హాట్‌టాపిక్‌గా మారింది.

