
మనింట్ల వస్తువులను పక్కోడొచ్చి పట్టుకపోకుండ, దొంగోడొచ్చి దోసుక పోకుండ ఏం సేత్తం? గట్టిగ ఉండే తాళం కప్పను యేత్తం. గదానికి ఓటి పోతే మరోటి ఉండాల్నెని, ముందు జాగ్రత్తగ మూడు, నాలుగు తాళం శెవిలను శేపిత్తం. ఇగ గిప్పుడు గా తాళం శెవిలతోటి పనే లేదుల్లా! తాళం శెవిలే అక్కరలేని తాళం కప్పలొచ్చినయి.
గిదంతా డిజిటల్ యుగమాయె. గట్లనే గదాన్ని ఉపయోగించి, తాళాలు తయారు శేత్తాండ్లు. గదాన్ని గొల్లెంల పెట్టి ఒత్తితే ఖతం. తాళం పడతది. ఇగ గదాన్ని తీయాలంటే తాళం శెవితో పనేలేదు! ముందే అచ్చుగ పెట్టిన మన శేతి యేలును పెడితే సాలు టక్కున తెరుసుకుంటది. గది గాక మన యేరే యేలు పెట్టినా, వేరే ఎవ్వరేలు పెట్టినా తెరుసుకోదు. ఇగ గీ తాళం మంచిగుంది కదా? పోనుకు తాళం పెట్టినట్లే! దొంగకు దొరకదు. పక్కోనికి పట్టదు. ఇగ రానురాను గిసొంటి తాళాలే ఒత్తయుల్లా!?

