
కోదాడ పట్టణ ఎస్సై పులి వెంకటేశ్వర్లు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి పలికారు. ఇంకా ఐదు నెలల సర్వీస్ మిగిలి ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకుని రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో, స్థానిక ప్రజల్లో పెద్ద చర్చనీయాంశమైంది. తన స్వగ్రామం కోదాడ మండలం గుడిబండకు సేవ చేయాలన్న ధ్యేయంతోనే ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు, పుట్టిన ఊరికి ఏదైనా తిరిగి ఇచ్చుకోవాలన్న ఆరాటమే నా నిర్ణయానికి కారణం అని ఎస్సై వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్పంచ్ పదవికి అప్పుల బారం తప్పదని మాజీ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో, స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి గ్రామాభివృద్ధి కోసం ముందుకు రావడం సంచలనంగా మారింది. ఉద్యోగాలను వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారి జాబితాలో ఇప్పటికే ఐఏఎస్ వెంకట్రామ్ రెడ్డి, డీటీవో చంద్రశేఖర్, మాజీ ఐఏఎస్ ఏ.ఎండి. ఇంతియాజ్, అలాగే సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ వంటి అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎస్సై వెంకటేశ్వర్లు గ్రామ ప్రజాసేవ కోసం కొత్త ప్రయాణం మొదలుపెట్టడం ప్రజల్లో కొత్త చర్చకు దారి తీసింది.

