
కరీంనగర్ జిల్లా నాగిరెడ్డిపూర్‌లో సర్పంచ్ రిజర్వేషన్ ఒక అవివాహేతుడి జీవితాన్నే తారుమారు చేశాయి. ఎస్సీ మహిళలకు సర్పంచ్ స్ధానం రిజర్వ్ కావడంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న ముచ్చె శంకర్ పెండ్లి చేసుకుంటే భార్య పేరుతో రాజ్యం నడుపొచ్చు అనుకున్నాడు. దాంతో సర్పంచ్ అయ్యేందుకు ఒక్క పెళ్లి చాలు! అనే ఆలోచనతో నల్గొండ జిల్లాకు చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి, ఆమె పేరు ఓటర్ జాబితాలో చేర్చితే సరిపోతుంది అనుకున్నాడు. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం అకస్మాత్తుగా నోటిఫికేషన్ జారీ చేయడంతో శంకర్‌కు టైమ్ లేకుండా పోయింది. మరుసటి రోజే ఆలయంలో పెండ్లి చేసుకున్నాడు. కానీ ఓటర్ లిస్టు లో పేరు కోసం దరఖాస్తు చేసుకోవడం ఆలస్యం కావడంతో వధువు పేరు లిస్ట్‌లోకి చేరలేదు. దాంతో శంకర్‌కు సర్పంచ్ కావాలి అనుకున్న కోరిక తీరలేదు కానీ జీవితంలో పెళ్లి అనే అంకం మాత్రం తీరిపోయింది అని కొందరు, అనుకున్నదొక్కటి… అయినదొక్కటి… బోల్తా.. కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అంటూ మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తమ్మీద శంకర్ కథ రిజర్వేషన్ వల్ల సర్‌ప్రైజ్‌గా మొదలై, ఓటర్ జాబితా వల్ల షాక్‌గా ముగియగా, శంకర్ మాత్రం నైరాశ్యంతో తల పట్టుకున్నాడు.

