
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నగారాతో గ్రామాలు పండుగ వాతావరణంలో మునిగిపోయాయి. తొలి విడత నామినేషన్ల స్వీకరణతోనే ప్రతీ పల్లెలో రాజకీయ సందడి మొదలైంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూఠాపురం గ్రామం నుంచి పోటీ చేస్తున్న రావెళ్ల కృష్ణరావ్ మేనిఫెస్టో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఇచ్చిన హామీలు వరాల జల్లుల్లా కురుస్తున్నాయి. దేవాలయాల అభివృద్ధి నుంచి పేదల సంక్షేమం వరకు, విద్యార్థుల ప్రోత్సాహం నుంచి నీటి బిల్లుల చెల్లింపుల వరకు మొత్తం 21 పాయింట్ల మేనిఫెస్టోను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
వీరన్న స్వామి ఆలయానికి 1 ఎకరం భూమి విరాళం, ఐదేళ్ల పాటు గ్రామస్తుల ఇంటిపన్ను, నీటిపన్నులు తానే భరిస్తానని ప్రకటించారు. ఉచిత వైద్య శిబిరాలు, దేవాలయాలకు వార్షిక సాయం, మసీదులు–చర్చిలకు, పండుగల ప్రార్థనల కోసం ఆర్థిక సహాయం, వినాయక నవరాత్రులకు ఉచిత విగ్రహాలు వంటి హామీలు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ పండుగలకు బహుమతులు, ప్రతిభావంతుల విద్యార్థులకు స్కాలర్షిప్‌లు, సైకిళ్ల పంపిణీ కూడా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పేదవారికి బట్టల పంపిణీ, అన్నదానం, కుట్టుమిషన్లు, ఉచిత మినరల్ వాటర్ సరఫరా, డీజే–మైక్ సౌకర్యం, బాడీ ఫ్రీజర్, వైకుంఠ రథం ఏర్పాటు, వికలాంగులకు ట్రైసైకిళ్లు వంటి సంక్షేమ హామీలు గ్రామంలోనే గాక రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి.

