జనాలు పెరిగిపోబట్టే, అడవులు తరిగిపోబట్టె. గిప్పుడంటే గియన్నీ వచ్చినయి గనీ, ఎనుకటికి ఇంటికి, ఇండ్లల్ల మంచాలకు, కూసునే కుర్సీలకు అన్నింట్లకు శెట్ల కర్రనే వాడేది. చలి, భూకంపాలొచ్చే దేశాల్నైతే శెక్క ఇండ్లనే కట్టుకుంటరు. ఇగ మల్ల ఎనుకటి కాలం గిర్రున తిరిగి వస్తాందుల్లో!
ఇగో అమెరికల మేరీల్యాండ్ అని ఓ పెద్ద బడి ఉంది. గా బల్లె సదెవెటోల్లు ఓ శెక్కను కనిపెట్టిండ్రు. ఇగ గా శెక్క ఇటకపెల్ల లెక్కనే ఉంటది. గనీ, గది స్టీలుకంటే 10 రెట్లు గట్టిగ ఉంటదట. రాతెండికంటే అలకగ ఉంటదట. ప్లాస్టిక్ లెక్క గాకుండ, కట్టె లెక్కనే భూమిల కరిగిపోతదట. శెట్ల శెక్కను తీసుకుని, గదాంట్లె కొన్ని బాగాలను తీసేస్తరు. గదాన్ని గవేవో రసాయానాల్లో ముంచుతరట. తర్వాత ఎక్కువ యేడితోటి గదాన్ని దగ్గరకు ఒత్తుతరట. ఇగ గది గట్ల గట్టిగ తయారైతదట. ఇగ గదాన్ని గక్కడికే ఆపలేదుల్లా.. దాన్ని తయారు శేసుడు గూడ సురువు శేసిండ్లట. గ దాన్ని ఇండ్లకు, రచ్చనకు, మనం తిరిగే మోటర్లకు గూడ వాడుతాండ్లట. ఇగ గివీ మన దగ్గరకు గూడ తొందరగనే వస్తయట. గవాటి ధర ఎంతుంటదో గనీ, వాడితే మస్తుగుంటదట.

