దేవుని కాడ, శుబ కార్యాల కాడ మనం కొబ్బరికాయలను కొడుతం. కోరిన కోర్కెలు తీరాలని మొక్కుతం. గనీ, గా కొబ్బశిప్ప నుంచి కుడుకను వేరు శేయాలంటే మస్తు తిప్పలు పడతం. కత్తులు కటార్లు పడతం. నేలకు కొడతం. గాయింత గది రాకపోతే పండ్లతోటే కొరుక్కొని తింటం. గిదంత తిప్పలు లేకుండా గా కొబ్బరి శిప్పను, కుడుకను యేరు శేసే ఉపాయం ఒకటి శెప్త యినుండ్లి.
కొబ్బరి శిప్పను తీసుకోవాలె. గ దాన్ని గ్యాస్ స్టౌ మీదనో, నిప్పుల పొయ్యి మీదనో మంట పెట్టి, శిప్పను కాల్వాలె. కాసంత నల్లగైతాంటే గదాన్ని తియ్యాలె. సల్లబడ్డంక గా శిప్ప మీద శిన్నగ సుత్తెతోటో, కత్తితోటో కొట్టాలె. లేకపోతే బండకేసి కొట్టినా గా శిప్ప పగలిపోతది. గా కుడుక ఎట్లుందో గట్లనే బయటకొస్తది. ఎట్లుంది? గీ ఇకమతు? కావాలంటే శేసి సూడుండ్లి.

