
దొంగకు శెప్పే లాబమన్నరు. ఇయ్యాల రేపు ఇండ్లకు కన్నమేసేటోల్లే లేకుండ పోతాండ్లు. అంతా కట్టమే లేని నేరాలకు అలవాటు పడ్డరు. కూసున్న కాడనే సంపాయించాలె. అందరి బ్యాంకుల అకౌంట్లలో సొరబడాలె. ఉన్నది సాపు శేయాలె.
ఇగ ఆడపిల్లల రచ్చణ గూడ కరువైతాంది. లైంగిక వేధింపులాయె, దోపిడీలాయె. దొంగతనాలాయె. ఇగ గిసొంటి వాటినుంచి రచ్చణకు ఒకాయిన మస్తుగ ఆలోశన శేసిండు.
తనింటికి ఓ దర్వాజకు రెండు తలుపులు పెట్టిండు. ఒక తలుపు తీయంగనే రెండు తలుపుంటది. గదాన్ని గట్టిగ ఇనుప సువ్వలతోని శేయించి, గదానికి జాలి పెట్టిండు. గా జాలికి శిన్న కిటికీ గూడ పెట్టిండు. ఎవలన్న వత్తే, మొదటి తలుపు తీసి సూడొచ్చు. ఏమైనా కావాల్నంటే గా శిన్న కిటికీల కెలి తీసుకోవచ్చు. ఎవలైనా అనుమానం వచ్చేటట్లు శేస్తే, రెండు తలుపులేసుకుని పోలీసులకు పోను శేసి, పిలిపిచ్చి గట్టిగ తన్నిపీయొచ్చు. మంచిగుంది గదా గీ కిటుకు?

