
మైదాకంటే మన ఆడోల్లకు మా పిచ్చి. పడి సస్తరు. శెట్టుశెట్టుకు మైదాకునేరి, గిప్పుడంటే రుబ్బే మిషిన్లు ఒచ్చినయి గనీ, అప్పట్ల రోట్లేసి, గదాంట్లె పిట్ట పియి- పిట్ట కాల్లు, కోమటి రాల్లు, కాసు, శీపురుపుల్లలు యేసి నూరేది. ఇగ గదాన్ని శేతులకు, కాల్లకు పెట్టుకుని, గుడ్డపేగులు కట్టకునేది. పండుకునేది. తెల్లారంగనే లేసి, గా మైదాకును తీసేసి, ఎర్రగ పండిన శేతులను సూసుకుని మురిసేది. మైదాకు బాగ పండితే మంచిమొగుడొస్తడని గా పిల్లల్ని ఆట పట్టించేది.
ఇగ రానురాను గీ మైదాకే, మెహందీ పేరుతోనే రకరకాలుగా మార్కెట్లకు వచ్చింది. పేషన్ గా మారింది. ఇగ గండ్ల అంతా కెమికలే అనుకోండ్లి. మైదాకు లెక్కనే టాటూలు గూడ ఒచ్చినయి. శెయితోనే గాక, మిషిన్లతోటి గూడ మైదాకులేయబట్టిరి. ఇగ గది గూడ మారి, గిప్పుడు గీ కొత్త పేషన్ ఒచ్చింది. సూది యేసే సిరంజీ బుడ్లతోటి మెహందీ యేస్తున్నరట. గదెట్లంటే సూదితోటి సిరంజి బుడ్లకు గా మైదాకును ఎక్కిస్తరు. గదే సూదిచ్చినట్లు ఒత్తుకుంట డిజైన్లేస్తరు. ఎట్లైతేంది? గీ మైదాకు మాత్రం ఎనుకటి నుండి ముందుకు సాగుతన్నదా? లేదా? అన్నదే ముక్యం ఏమంటరు?

