
యే తియ్! గిది నిజం గని. అంతా అబద్ధమే! అనుకుంటాండ్లు గదా? శెట్లకు డబ్బులు కాత్తయో లేదో కనీ, బంగారమైతే పూత్తాందంటే నమ్ముండ్లి. ఇగో కాదంటే.. గిది సదువుండ్లి.
ఫిన్లాండ్ అనే దేశం ఉంది గదా. గా దేశం అడవుల్ల ‘నార్వే స్ఫ్రూస్’ అనే శెట్లు పెరుగుతానయట. గీ శెట్లకు బంగారం రంగుల, మిలమిల మెరిసే సూదుల్లెక్క ఆకులున్నయట. గా ఆకుల కొసల్ల బంగారం రేణువులు కాస్తానయట. గవాట్ని బయిటికి తీసి, ఒక పద్ధతిల ప్రాసెస్ జేస్తే, గదంతా బంగారం అయితాందంట. గా అడివిల ఉన్న 23 శెట్ల పై జియాలాజికల్ సర్వే ఆప్ ఫిన్లాండోల్లు, ఔలు విశ్వవిద్యాలయపోల్లు పెషల్ గా సదవిండ్లంట. 138రకాల గా శెట్ల ఆకుల్ని సేకరించిండ్లంట. శిన్నశిన్నయి పెద్దగ కన్పించే గా మిషిన్ల జూస్తే, పరేషానైండ్లంట. న్యాల లోపల ఉండే బంగారం, గా శెట్ల యేర్లు పీల్సుకునే నీటి కానుంచి గా శెట్ల ఆకులకు వస్తాందట. గదే గా శెట్టు ఆకు కొసలకు పోయి, కంటికి పెద్దగా కనిపించని అతి శిన్న కణాల్లెక్క ఘన రూపంల బంగారం అయితాందంట.
అయితే గవన్ని శెట్లకు బంగారం పూస్త లేదట. భూమి లోపల బంగారం ఉన్న సోటు, నేల, నీటి ప్రవాహాన్ని బట్టి గా బంగారం పూస్తాందని తేల్సిండ్లు. ఇగ శెట్లకు డబ్బుల సంగతి దేవుడెరుగు? బంగారం కాసుడు ఖాయమైందన్నట్లు!

