
గీ పోకిరి పోరగాండ్ల లెక్క… ‘దుడ్డె దూపకేడిస్తె, బర్రె గడ్డికేడ్సినట్లుంది.’ జనం లెక్క ఓ తీర్గ ఉంటే, గీ పోకిరోల్ల లెక్క ఇంకో తీర్గ ఉంటదన్నట్లు. మొన్నా మధ్య యినాయికున్ని నీళ్ళల్ల ముంచినం గద. గదే నిమజ్జనం చేసినం గద. గంతకంటే ముందు యినాయకుని యిగ్రాలు పెట్టి తొమ్మిది రోజులు కొల్సినం. గట్లనే గా యేటేట లెక్కనే, కైరతాబాద్ ల పెద్ద యినాయకున్ని పెట్టిండ్లు. ఇగ గా పెద్ద యినాయికున్ని చూడ్డానికి చిన్నా, పెద్దా తేడా లేకుండ జనం ఎగ బడ్డరు. యిగ గిదే సందని, సందిట్లో సడే మియాల్లెక్క పోకిరి పోరగాండ్లు గూడ ఎగబడ్డరట. ఇగ పోయినోడు పోక, జనంల కల్సిపోయి, ఆడిపోరగాండ్లను ఒకటే సతాయించుడట. యెకిలి మకిలి పనులు జేసుకుంట యేడ్పించిండ్లట.
ఇగ గీ ముచ్చట గా పోలీసోల్లకు తెలిసింది. యెంటనే షీ టీమ్లను రంగంలకు దించిండ్లు. గవాల్లు గూడ సాదాసీదా బట్టల్తోని గా లైన్లల్ల నిలబడ్డరట. పోకిరి పోరగాండ్లకు గియన్ని తెల్వయి గద. సక్కగపోయి, ఎప్పట్లెక్కనే కనబడ్డ ఆడోల్లని, కంటికి నచ్చిన, ఇంపైనోల్లని ఏడ్పించుడు మొదలు పెట్టిండ్లట. ఏడబడితే ఆడ ముట్టుకుని ఆగమాగం చేసిండ్లట. ఇగ గీ షీ టీమ్ పోలీసోల్లు కంట్లె పడ్డంక ఊకుంటారు? దొరికినోన్ని దొరికినట్లు పట్టుకుని బొక్కలేసిండ్లట.
ఇగ గీ పోరగాండ్ల లెక్కలు సూసి పోలీసోల్లే పరేషాన్ అయిండ్లంట. దొరకిన పోకిరోల్లు పదో పరకో గాదు. మొత్తం 1,612 మంది ఉన్నరట. మళ్ల గండ్ల 1,544 మంది పెద్దోళ్ళు ఉంటే, 68 మంది పోరగాండ్లకు 18 ఏండ్లు గూడ నిండలేదట. ఇగ గవాల్లంతా మైనర్లే గద. గిదేం మాయ రోగం, గిదేం పోయే కాలమని, గా పెద్దపెద్దోల్లను జైలుకు పంపించి, మిగితోల్లకి ఆర్నింగ్లు, కౌన్సిలిగులిచ్చి ఇంటికి పంపిండ్లట.
ఇగ గీ ముచ్చట తెల్సినోల్లు ముక్కుమీద ఏలేసుకుంటాండ్లు. గీ కచరా పనులేందిరా? గీ కరువేందిరా, గీ పోరగాండ్లకు గత్తరరాను. అని తిట్టకుంటాండ్లంట. దేవుని దగ్గరా మీకు రచ్చణ లేకుంటైతాంది. ఓ బిడ్డలూ… జెర పైలం!

