
‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని’ పాటకు గా పెండ్లి పిల్ల, పిల్లగాడు బారాత్ ల ఆడితే అబ్బో గిదేందని అంతా సూసి ముక్కుమీదేలేసుకున్నరు. సూసినోల్లు సూసినట్లే పక్కోల్లకి పంపి తెగ వైరల్ జేసిండ్లు. ఇగ గా పాటైతే అందరి నోళ్లల్ల నానింది. యే.. గదంతా సంతోసంలో చేసిండ్లులే! అనుకున్నరు. ఇగ గీమైతే అందర్ని ఆశీర పరశింది. గీ మద్దె బాగా ట్రెండింగులో కొచ్చిన ‘దారి పంటొత్తుండు, దబ్బదబ్బొత్తుండు. దారిద్దునా, పోనిద్దునా, జోరు మీదొత్తుండు, కారు మీదొత్తాండు తోలేద్దునా, పోనీ, ఊకుందునా’ అన్న పాటకు ఆడి గీ పంతులమ్మమ్మ తెగ వైరల్ అయింది.
గదేనుల్ల గా నాగర్ కర్నూలు జిల్లల, కొల్లాపూర్ ఉంది గదా. గా ఊరి పెద్ద బడిల గొల్లకిష్ట గారి రమాదేవి అనే పంతులమ్మ పదవి దిగిపోతాంది. ఇగ గామెకు గా బడి పంతుల్లు, పంతులమ్మలు, పొల్లగాండ్లంతా కలిసి, యీడ్కోలు మీటంగు పెట్టిండ్లు. మీటింగైనంక గా పంతులమ్మ గా పాటకు తగ్గట్టుగ ఆడి పాడింది. మద్యల పాటను ఆపినా.. గామె ఆగలె. పాటైపోయే దాక గింత మొసపోయకుండ, ఆడుతనే ఉంది. ఇగ గది సూసి గా పోరగాండ్లు ఒకటే ఈలలేసిండ్లు. గంతులేసిండ్లు.
బడి దిగిపోతాందంటే. గామెకు 61 ఏండ్లు నిండినట్లె గద. గన్నేండ్లు మీద బడ్డా గూడ, గామె గంతగనం గంతులేసుడేందని అంతా అబ్బురపడ్డరు! అబ్బో! గీ పంతులమ్మమ్మ గట్టిదేనని మనం గూడ గట్టిగ నమ్మాలె గదా? అయినా ఆడిపాడడానికి ఏండ్లతో ఏం పని? ఉరుకులాట, మన శెత్తల సత్తా ఉండాలె గని!? అవునా? కాదా? ఏమంటరు?

