మొదటి ప్రపంచ యుద్ధం జూలై 28, 1914 నుండి నవంబరు 11, 1918 వరకు 4 ఏళ్ళ, 3 నెలలు 2 వారాల పాటు సాగింది. రెండో ప్రపంచ యుద్ధం సెప్టెంబరు 1, 1939 నుండి సెప్టెంబరు 2, 1945 వరకు, 6 ఏళ్ళపాటు జరిగింది. జర్మనీ పోలాండ్‌పై దాడి చేయడంతో మొదలై, జపాన్ అధికారికంగా లొంగిపోవడంతో ఈ యుద్ధం ముగిసింది. ఆధునిక కాలంలో, అమెరికా 2001 నుండి 2021 వరకు 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్‌పై సుదీర్ఘ యుద్ధం చేసింది. పాక్ పై భారత్ యుద్ధం రోజుల్లోనే ముగిసింది. తాజాగా రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం నాలుగేళ్లు దాటినా ముగియడం లేదు. యుద్ధాలు ఎక్కడ జరిగినా నష్టపోయేది సామాన్య ప్రజలే. దేశాలు ప్రతిష్ఠ, భద్రత, ప్రభావం అనే పేర్లతో రాకెట్లు దూసుకున్నా, తుదకు అమూల్యమైన మానవ సమాజమే హననం అవుతోంది.
2014లో రష్యన్ ఫెడరేషన్ ద్వారా క్రిమియా విలీనం జరిగిన రోజే రష్యా-ఉక్రయిన్ యుద్ధానికి బీజం పడింది. రష్యా క్రిమియాను విలీనం చేసుకోవడం, తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్ బాస్ ప్రాంతంలో రష్యా అనుకూల తిరుగుబాట్లు చెలరేగడం, ఆ తర్వాత పెరుగుతూ వచ్చిన భద్రతా ఉద్రిక్తతలు కలిసి ప్రస్తుత పరిస్థితికి దారి తీశాయి. 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ పై సైనిక దాడి ప్రారంభించడంతో ఐరోపా ఖండం మరోసారి యుద్ధ గర్జనలను అనుభవించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పతిన్ నాటో విస్తరణను తన దేశ భద్రతకు ముప్పుగా భావిస్తున్నారు. నాటో తూర్పు దిశగా విస్తరిస్తూ ఉక్రెయిన్‌కు సభ్యత్వ సంకేతాలు ఇవ్వడం రష్యా ఆందోళనలకు కారణమని మాస్కో వాదన. కాగా, మరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, తమ దేశ భౌగోళిక సమగ్రత, స్వతంత్ర విదేశాంగ హక్కును కాపాడాలనే సంకల్పంతో పాశ్చాత్య మద్దతును సమీకరించారు. ఈ విభిన్న దృక్కోణాల మధ్య రాజీ సాధ్యం కాలేకపోవడం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది.
యుద్ధం సహజంగానే అత్యంత భయానకంగా, దారుణంగా అమానవీయంగా ఉంటుంది. లక్షలాది మంది సైనికులు గాయపడ్డారు. కోట్లాది మంది ఉక్రెయిన్ పౌరులు శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లాల్సి వచ్చింది. విద్యుత్ కేంద్రాలు, రవాణా వ్యవస్థలు, పరిశ్రమలు ధ్వంసమవడంతో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. రష్యాపై అమెరికా, యూరోపియన్ దేశాలు అమలు చేసిన కఠిన ఆంక్షలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపాయి. ఇంధన ధరలు పెరగడం, రవాణా దెబ్బతినడం వంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన వ్యయాన్ని పెంచాయి.
అయితే ఈ యుద్ధం ఎందుకు ఆగడం లేదు? భూభాగాలే ప్రధాన సమస్య. క్రిమియా, డాన్‌బాస్ ప్రాంతాలపై ఇరు దేశాలూ వెనక్కి తగ్గడం లేదు. రష్యా తన ఆధీనంలో ఉన్న ప్రాంతాలను వ్యూహాత్మకంగా కీలకంగా భావిస్తోంది. ఉక్రెయిన్ మాత్రం వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఉంది. ఇలాంటి సందర్భంలో “యథాతథ స్థితి”కి ఒప్పుకోవడం రాజకీయంగా రెండు దేశాలకీ క్లిష్టమే.
మరో సమస్య అంతర్జాతీయ జోక్యం. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక మద్దతు అందిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని తాను త్వరగా ముగించగలనని పలుమార్లు వ్యాఖ్యానించినా, వాస్తవ రాజకీయ సమీకరణాలు అంత సులభం కావని స్పష్టమైంది. రష్యాపై విధించిన ఆంక్షలు కూడా మాస్కోను పూర్తిగా వెనక్కి తగ్గించలేకపోయాయి. ప్రపంచ శక్తుల పోటీ, ఈ యుద్ధాన్ని గ్లోబల్ శక్తి సమీకరణల పరీక్షగా మలిచింది.
ఈ నేపథ్యంలో శాంతి సాధ్యమేనా? భద్రతా హామీలు, సైనిక పరిమితులు, భూభాగాల భవిష్యత్తు వంటి అంశాలపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించవచ్చు. కానీ, యుద్ధం ద్వారా సంపూర్ణ విజయం సాధిస్తామనే దురాశ రెండు దేశాలకు తగ్గాల్సి ఉంది.
దేశాల మధ్య వివాదాలెంత ముదిరినా, చివరకు శాంతి చర్చలే శాశ్వత పరిష్కారం. నాలుగేళ్లుగా మండుతున్న ఈ రావణ కాష్టం ఎప్పటికి చల్లారుతుందో చెప్పడం కష్టం. అయితే రణరంగాల రక్తంతో గీసిన సరిహద్దులు ఎప్పటికీ స్థిరంగా నిలవవని చరిత్ర చెబుతోంది. ఇరు దేశాలు, అంతర్జాతీయ సమాజం బాధ్యతాయుతంగా చొరవ చూపితేనే ఈ సంక్షోభానికి ముగింపు లభిస్తుంది.

