
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఊహించని కోణాలతో రసవత్తరంగా మారుతున్నాయి. యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో సర్పంచ్ పీఠం కోసం భార్య–భర్తలే ప్రత్యర్థులుగా బరిలో నిలవటం గ్రామంలో హాట్‌టాపిక్‌గా మారింది. గ్రామానికి చెందిన నారగోని మహేష్ రాజకీయంగా చురుకైన వ్యక్తి. ఎప్పుడూ తన గురువైన జ్యోతిష్యుడి సూచనలు పాటించే అతడు, ఈసారి సర్పంచ్‌గా పోటీ చేయాలని భావించాడు. అయితే గురువు విజయం కోసం భార్యను కూడా పోటీలో ఉండాలని సూచించడంతో వెంటనే మహేష్‌తో పాటు భార్య శ్రీలత కూడా నామినేషన్ వేసింది. మహేష్‌కు ఉంగరం, శ్రీలతకు కత్తెర గుర్తులు వచ్చాయి. ఇద్దరి పేర్లు బ్యాలెట్‌లో కనిపించడంతో గ్రామంలో ఆసక్తి రెట్టింపు అయ్యింది. మహేష్ భార్య తనతో పాటు ఉంటేనే కలిసొచ్చిందనే సెంటిమెంట్ రాజకీయంగా పనిచేస్తుందా? లేక ఓటర్లు భార్యకు గానీ, భర్తకు గానీ అనూహ్య తీర్పు ఇస్తారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

