
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సర్పంచ్ పదవికి భార్య, భర్త, కొడుకు లు ముగ్గురూ నామినేషన్లు వేయడం గ్రామంలో చర్చనీయాంశమైంది. గతంలో తన నామినేషన్ తిరస్కరణకు గురైన పుల్ల సాయగౌడ్ ఈసారి ముందుజాగ్రత్తగా భార్య పుష్పలత, కుమారుడు వెంకటేశ్‌లతో కలిసి నామినేషన్ వేయించాడు. బీసీ జనరల్‌కు కేటాయించిన ఈ స్థానానికి మొత్తం 12 మంది బరిలో ఉండగా, వీడీసీ వేలంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఉపసంహరణకు అవకాశం ఇవ్వకపోవడంతో ముగ్గురూ పోటీలో కొనసాగాల్సి వచ్చింది. అయితే ప్రచారంలో మాత్రం ముగ్గురూ కలిసే తిరిగి, ఓటు మాత్రం సాయగౌడ్‌కే వేయాలని ఓటర్లను కోరుతున్నారు. పుష్పలత బొట్టు పెట్టి, సాయగౌడ్ తన గుర్తు స్పానర్‌ను చూపించి, వెంకటేశ్ బ్యాలెట్ పేపర్ పట్టుకుని ఓటు వేయాలని ప్రచారం చేయడం గ్రామ రాజకీయాల్లో కొత్త ఎక్స్‌పరిమెంట్‌గా నిలిచింది.

