
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుండగా, ములుగు జిల్లా మంగపేట మండలం మాత్రం మరోసారి ఎన్నికలకు దూరమైంది. 14 ఏళ్లుగా గిరిజన, గిరిజనేతర రిజర్వేషన్ల వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండడంతో ఈసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం లేదు. 25 గ్రామపంచాయతీలు, 14 ఎంపీటీసీలు, 230 వార్డులు, 39,369 మంది ఓటర్లతో ఉన్న ఈ భారీ మండలానికి ఎస్ఈసీ నోటిఫికేషన్‌లో మినహాయింపు ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాక కూడా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. 2011 నుంచి ఇక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు లేకుండా ప్రత్యేక అధికారులే పాలన కొనసాగిస్తున్నారు. 2014, 2019లో కూడా ఏర్పాట్ల మధ్యలోనే ఎన్నికలు ఆగిపోయిన మంగపేట మండలంలో ఈసారైనా ఓటు వేయగలమన్న ప్రజల ఆశలు మరోసారి ఆవిరయ్యాయి.

