CENTRAL MINISTER|కేంద్ర మంత్రి KISHAN REDDY|కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, బనకచర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం అవినీతి అంశాలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టుకు బీజేపీ తరఫున ఇప్పటికే పిటిషన్ వేశామని ఆయన తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ప్రజావ్యతిరేక చర్యలపై సీబీఐ విచారణ జరపాలంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి ఉత్తరం రాసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సీబీఐ విచారణపై నిశ్శబ్దంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. నాటి హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయవాదులు, వ్యాపారులు, నటులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయన్నారు. అంతేకాకుండా తన ఫోన్‌తో పాటు బీజేపీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేయబడినట్లు పేర్కొన్నారు. అందుకే సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించిందని, ఆ దిశగా త్వరలో తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కేంద్రం పరిశీలనలో ఉందని, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తమ నివేదికను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు, సెంట్రల్ వాటర్ కమిషన్‌కు సమర్పించిందన్నారు. ఈ అంశంపై జల ఒప్పందాలు, నిబంధనలు, గైడ్‌లైన్లు, ఇతర రాష్ట్రాల అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సెంట్రల్ వాటర్ కమిషన్ సమగ్ర పరిశీలన జరిపి తుది నివేదికను కేంద్రానికి అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇంతవరకు ఎవరికీ అన్యాయం జరగలేదని, జరగబోదని చెప్పారు. తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలన్న సూచన చేశారు.
ఇటీవల కొన్ని విమర్శల నేపథ్యంలో స్పందిస్తూ… కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు అనే విమర్శలు తగవని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, వరద జలాల సమస్యలు ఉన్నా, ఇప్పటివరకు సమాచార మార్పిడి జరగలేదని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేంద్ర జలశక్తి మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయాలని, అవసరమైతే ఏపీ సీఎం పిలిపించి మాట్లాడే బాధ్యతను కేంద్రం చేపట్టాలని సూచించారు.
కాళేశ్వరం విషయంలో బీజేపీ ధోరణి ఎప్పటిలానే స్పష్టంగా ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో దోపిడీ జరిగిందని అప్పుడే నిపుణులు హెచ్చరించారని, ఇప్పుడు మేడిగడ్డకు వచ్చిన పగుళ్లు వారి మాటలు నిజమయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కూడా సీబీఐ దర్యాప్తు కోరామన్నారు. ఇప్పుడు కూడా అదే డిమాండ్ కొనసాగుతుందని చెప్పారు. గతంలో సీబీఐ దర్యాప్తు కోరిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాస్తవాలపై గౌరవం లేకుండా తన దిశను మార్చుకోవడం బాధాకరమన్నారు.