ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన CARONA|కరోనా వైరస్|VIRUS మళ్ళీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో నాలుగువేల కేసులు నమోదైనట్లు సమచారం. అలాగే అక్కడక్కడా మరణాలు కూడా నమోదవుతున్నాయి. గతంలోలా ఇది అంత డేంజర్ కాదంటున్నా తీవ్రతను తక్కువ చేయడానికి లేదు. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఎన్‌బి.1.8.1, ఎల్‌ఎఫ్.7 వేరియంట్లు వున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే, గతంలో మాదిరిగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, ఆయాసం, నీరసించిపోవడం వంటి లక్షణాలు ఇప్పుడు లేవు. ఈ వేరియంట్లు- అంత ప్రమాదకరమైనవి కావని, అయినప్పటికీ, అప్రమత్తంగా వుండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కొత్తగా వచ్చే ఈ కరోనా తీవ్రమైనదో, సాధారణమైనదో, అసాధారణమైనదో ఇప్పుడే చెప్పలేము. మున్ముందు దీని తీవ్రత తెలియనుంది.
పేదరికం, పౌష్టికాహారం లోపం, వాతావరణ కాలుష్యం వంటి అనేక రుగ్మతలు మానవాళిని చుట్టుముట్టి, ఊపిరి సలపనివ్వని విపత్కర పరిస్థితిలో మళ్లీ కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. సాంకేతికంగా, వైద్య, ఆరోగ్యపరంగా ఎంతో పురోగతి సాధించినా కరోనా మానవాళిని వణికించింది. కబళించింది. ఇది మొత్తం ప్రపంచ సామాజిక, ఆర్థిక వ్యవస్థలను, వైద్య రంగాన్ని సవాల్ చేసిందంటే అతిశయోక్తి కాదు. ఆందోళన కంటే, గత అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాలతోపాటు, ముందుజాగ్రత్త, పరిశుభ్రత, అప్రమత్తతలతో దీన్ని ఎదుర్కోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరలాల పారిశుద్ధ్యం వంటివి అత్యంత ప్రధానమని గుర్తించాలి.
గత కోవిడ్ సమయంలో వ్యాక్సిన్‌ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వున్నాయని ఆస్ట్రాజ్రెనెకాయే ఒప్పుకోవడంతో, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారు కేసులు వేసిన సంగతి తెలిసిందే. ఫార్మా కంపెనీలు, ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజాధనం దోచేశారనే ఆరోపణలూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కరోనా విజృంభిస్తోందన్న వార్తలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత రెండు వేవ్‌లలో సాగిన మహోత్పాతం పీడకలగా వెంటాడుతున్న తరుణంలో రోగ విస్తృతి, ప్రభావం, నివారణ వంటి విషయాల్లో ప్రభుత్వాలు ఎలాంటి దాపరికం లేకుండా ప్రజలకు భరోసా యివ్వాల్సి ఉంది. అలాగే ప్రజలను అప్రమత్తం చేయల్సిన అవసరం ఉంది. రెండు వేవ్‌ల అనుభవాలను గుణపాఠంగా తీసుకుని ప్రజలు మసులకుంటే మంచిది.
ప్రాణాంతకమైన కలరా, విష జ్వరాలను సైతం జయించాం. ఒక విధంగా కరోనాను సైతం గెలిచాం. కానీ, అవి మిగిల్చిన విషాదాలు కూడా మామూలేమీ కాదు. ఆర్థికంగా చితికిపోయి, ప్రాణాలను కోల్పోయి, అనేక కుటుంబాలు కకలావికలం అయ్యాయి. కొంత భయం, మరికొంత నిర్లక్ష్యం, ఇంకొంత మెడికల్ మాఫియా కలిసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి, దోచుకుని, పీల్చి, పిప్పి చేసి వదిలేశాయి. అంతేగాక నేటి కరోనా లాంటి విపత్తులకు మానవాళే కారణంగా పేర్కొనక తప్పదు. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యాలు మానవులనే బలి తీసుకుంటున్నాయి.
కరోనా ప్రభావం ఎంతకాలం ఉంటుందన్న దానికి సమాధానం లేకుండా పోయింది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్ విజృంభణతో మళ్లీ ఆంక్షల దిశగా పయనిస్తామా అన్న ఆందోళన కలుగుతోంది. కరోనా తీవ్ర రూపం దాల్చి, మరోమారు ప్రపంచం స్తంభిస్తే ఉత్పత్తి పడిపోవడం, వినియోగంతోపాటు డిమాండ్ పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మన లాంటి దేశాలు అతలా కుతలం అవుతాయి. గత రెండు వేవ్‌లలో జనజీవనంతోపాటు వ్యాపార, వాణిజ్యాలు మొత్తం దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారులు ఆదాయం లేక చితికి పోయారు. లాక్ డౌన్ల కారణంగా నెలల తరబడి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. కరోనా ప్రభావం వల్ల ఉపాధి, ఉద్యోగుల పనిగంటలు, వేతనాల కోతలకు దారితీశాయి. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించిన సందర్భాన్ని చూశాం. సెకండ్ వేవ్ సృష్టించిన విపత్తును తలచుకుంటేనే జనం వణికి పోతున్నారు. ఆక్సిజన్ లేమి, వైద్య సదుపాయాల కొరత, అరకొర టీకాలు ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేశాయి. ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు జనాన్ని వణికించాయి. అయితే, తాజా వేరియంట్ అంత ప్రమాదకారి కాదని ఒకవైపు, జాగ్రత్తగా ఉండాలని మరోవైపు వస్తున్న హెచ్చరికలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ప్రపంచానికి ఇప్పుడు మూడవ ముప్పు పొంచి ఉందంటూ వెలువడుతున్న సంకేతాల నేపథ్యంలో తాజా కరోనా వ్యాప్తి ఆందోళన కలిగించేదే. పౌష్టికాహార లోపం, ఆహారం కొరత, దారిద్ర్యం, ఉపాధిలేకపోవడం, నిరుద్యోగం, ఆకలి వంటి సమస్యల్లో మన దేశం మొదటి పది స్థానాల్లోనే ఉన్నామని పలు సూచీలు సూచిస్తున్నాయి. అధిక జనాభాతో కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్న వేళ వారిలో ఇమ్యూనిటీని ఆశించడం వంచనే అవుతుంది. వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్న వారిలో సైతం ఈ కొత్త రకం వైరస్‌ను నిరోధించే శక్తి ఎంత ఉంటుందనేది ప్రశ్నార్ధకమని నిపుణులు అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా, గతంలో తీసుకున్న ముందు జాగ్రత్తలే ఇప్పుడు కూడా తీసుకుంటే మంచిది. మాస్కులు ధరించడం, దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయడం వంటివి ఎల్లవేళలా పాటించడం అవసరమని గుర్తించాలి.

